సీనియర్ రాజకీయ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. హఠాత్తుగా మళ్లీ తెరపైకి వచ్చారు.కొంతకాలంగా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉంటూ వస్తున్నరెడ్డి గారు తాడిపత్రి గనులు, భూగర్భ కార్యాలయం వద్ద కొద్దిసేపు హల్‌చల్ చేశారు. నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తానని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన అధికారులను హెచ్చరించారు. సున్నపురాయి గనుల లీజు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తమకు ఇప్పుడు సన్మానం చేసిన అధికారులకు రెట్టింపు ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనికి ఫలితం తప్పక అనుభవించాల్సి వస్తుందని అన్నారు. అనవసరమైన విషయాల్లో కేసులు పెట్టి తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. తన మీద ఎందుకో దయతలచారంటూ భలే సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు రూల్స్ ఉండవని విమర్శించారు. బదిలీలకు భయపడి తమపై కేసులు పెడుతున్నారని అన్నారు. తాను వస్తున్నానని తెలిసి అధికారులు పారిపోయారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తాను మళ్లీ సోమవారం వస్తానంటూ వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల క్రితం వరకు తన సోదరుడిని టార్గెట్ చేసిన ప్రభుత్వం… ఇప్పుడు తనను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు.
కొద్ది నెలల నుంచి జేసీ సోదరులు కేసులతో ఇబ్బంది పడుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి వివిధ కేసుల కారణంగా దాదాపు రెండు నెలలకు పైగా కడప జైలులో ఉన్నారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కడప జైలులో ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌పై విడుదలై వస్తున్న సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, విధుల్లో ఉన్న సీఐను దూషించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సహా పలు కేసులు నమోదు చేశారు. బెయిల్‌పై విడుదలైన మరుసటి రోజే ఆయనను అరెస్ట్ చేసి మళ్లీ కడప జైలుకు తరలించారు. అయితే ఈసారి జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డి కరోనా సోకింది. జైలులో ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.