(కోపల్లె ఫణికుమార్)
జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల తరబడి తిరుగులేని పెత్తనం చెలాయిస్తున్న జేసి సోదరుల్లో ఆందోళన పెరిగిపోతోందా ? క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ వారిలో ఆందోళన ఎందుకు ? ఎందుకంటే, వచ్చే ఎన్నికలకు సంబంధించే అన్నది సమాధానం. మొదటిదేమో టిక్కెట్లు దక్కుతాయో లేదో అన్న సందేహం కాగా రెండో కారణమేమో ఒకవేళ టిక్కెట్లు దక్కిన గెలుస్తామో లేదో అనట. జిల్లాలో తిరుగులేని నేతలుగా చెలామణి అవుతున్న జేసి సోదరుల్లో కూడా ఆందోళన ఎందుకు మొదలైందంటే అందుకు కూడా కారణాలున్నాయి.
జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ నేతలుగా దశాబ్దాల పాటు జేసి సోదరులు బాగానే పెత్తనం చెలాయించారు. అయితే, రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ లో ఉంటే గెలుపు కష్టమని భావించి తెలుగుదేశంపార్టీలో చేరారు. జేసి సోదరులకు, టిడిపి నేతలకు ఏమాత్రం పడకపోయినా చంద్రబాబునాయుడు జోక్యంతో సయోధ్య జరగటంతో మొత్తానికి జేసి దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపిగా, జేసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎంఎల్ఏగా పోటీ చేసి గెలిచారు. నిజానికి జేసి సోదరులను కంట్రోల్ చేసే కెపాసిటీ టిడిపిలో చంద్రబాబుతో కలుపుకుని ఎవ్వరికీ లేదన్న విషయం బహిరంగ రహస్యం.
ఎందుకంటే, తాము అనుకున్నది దక్కకపోతే జేసి సోదరుల నోటికి అదుపన్నది ఉండదు. ఎవరిపైనైనా కానీ నోటికెంత వస్తే అంత మాట్లాడేస్తుంటారు. గడచిన నాలుగేళ్ళల్లో చంద్రబాబుతో సహా టిడిపి నేతలకు ఇది ఎన్నో మార్లు అనుభంలోకి వచ్చిందే. తమ నోటి దరుసుతో జేసి సోదరులు జిల్లాలోని టిడిపి నేతలందరినీ దూరం చేసుకున్నారు. జిల్లాలో కమ్మవాళ్ళ పెత్తనం ఎక్కువైపోవటంతో తామకు చాలా ఇబ్బందిగా ఉందని గతంలో జేసి దివాకర్ రెడ్డి బాహాటంగా చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనం రేపింది.
ఈమధ్యనే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సిట్టింగ్ ఎంఎల్ఏలను మార్చకపోతే కనీసం 10 నియోజకవర్గాల్లో టిడిపి ఓడిపోతుందని మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. నిజాలు మాట్లాడుతామన్న ముసుగులో నోటికొచ్చింది మాట్లాడేస్తుండటంతో జిల్లాలో శతృవులెక్కువైపోయారు. దానికితోడు తామనుకుంటున్న పది నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలకు పోటీగా కొత్త పేర్లతో చంద్రబాబుకు దివాకర్ రెడ్డి ఓ జాబితా కూడా అందించారు. వారందికీ టిక్కెట్లివ్వాల్సిందే అంటూ పట్టు పడుతున్నారు.
జేసి సోదరుల వైఖరితో విసిగిపోయిన ఆరుగురు టిడిపి ఎంఎల్ఏలు జేసికి వ్యతిరేకంగా ఏకమయ్యారని సమాచారం. అనంతపురం అర్బన్ ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి, రాయదుర్గం ఎంఎల్ఏ, మంత్రి కాలువ శ్రీనివాసులు, గుంతకల్ ఎంఎల్ఏ జితేందర్ గౌడ్, పుట్టపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డి, శింగనమలలో యామినిబాల, కల్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరిలు జేసి సోదరులపై మండిపోతున్నారు. వాళ్లల్లో ఎంతమందికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు వస్తాయో తెలీదు కానీ ఇప్పటికైతే వారెవరూ జేసి సోదరులకు సహకరించటం లేదు. తాడిపత్రిలో ఎటూ సోదరుడు ప్రభాకర్ రెడ్డే ఎంఎల్ఏ కాబట్టి ఏదో నెట్టుకొచ్చేస్తున్నారు.
రేపటి ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్ధులు సహకరించకపోతే దివాకర్ రెడ్డి గెలుపు కష్టమే. అందులోను వచ్చే ఎన్నికల్లో తమకు బదులుగా తమ కుమారులు పోటీ చేస్తారంటూ ఇప్పటికే జేసి సోదరులు ప్రకటించేశారు. ఒకవైపు ఎంఎల్ఏల సహాయ నిరాకరణ, ఇంకోవైపు తనయుల పోటీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో పాటు జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత. ఈ మూడు కారణాలతో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై జేసి సోదరుల్లో అభద్రత మొదలైందని సమాచారం. తమలోని అభద్రతను కప్పిపుచ్చుకునేందుకే ఎవరిపై పడితే వారిపైకి దాడులు చేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రభోదానంద స్వామి ఆశ్రమంపై దాడి కూడా అందులో భాగమేనట. అంతకుముందే తాడిపత్రి నియోజకవర్గం ఇన్చార్జి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేయించి రిమాండ్ కు పంపేశారు. ఇలా ఎవరిపైన పడితే వారిపై దాడులు చేయించటం, అరెస్టులు చేయించి రిమాండ్ కు పంపేయటంతోనే జేసి సోదరుల్లో పెరిగిపోతున్న భయానికి ఉదాహరణలుగా ప్రచారం జరుగుతోంది.