జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిఖార్సయిన రాజకీయం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క.. అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలేంటో జనసైనికులకీ అర్థం కాక కొంత గందరగోళం అయితే వుంది. కానీ, ‘కీలకమైన నిర్ణయాలు నాకు వదిలేయండి.. మీరు పార్టీని పటిష్ట పరచడానికి ప్రయత్నించండి.. జనంలో వుండండి..’ అంటూ జనసైనికులకు, జనసేన ముఖ్య నేతలకూ పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.
మరోపక్క, జనసేన అధినేత.. అధికార వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలకు గాలం వేస్తున్నారు. ఈ లిస్టులో సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వైసీపీలో ఎవర్ని ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ ‘పెద్దలు’ అనే మాట వాడరు. ‘పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డిగారంటే నాకు అమితమైన గౌరవం..’ అని చెబుతుంటారు పవన్ కళ్యాణ్.
తనను పవన్ కళ్యాణ్ అమితంగా గౌరవిస్తున్నారన్న కోణంలో సజ్జల ఏమైనా తగ్గుతారా.? అంటే, తగ్గరుగాక తగ్గరు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూనే వున్నారు. కానీ, సజ్జలను అంత ప్రత్యేకంగా పవన్ ఎందుకు గౌరవిస్తున్నారు.? అన్న చర్చ అయితే వైసీపీలో జరుగుతోంది. సజ్జల మీద వైసీపీలో కొందరికి అనుమానం పెరిగిపోతోంది కూడా.
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆనం వెంకట్రామిరెడ్డి విషయంలో కూడా పవన్ కళ్యాణ్‌కి ఒకింత సానుకూలత వుంది. తాజాగా మంత్రి పినిపే విశ్వరూప్ మీద కూడా జనసేన అధినేత సానుభూతి ప్రదర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీద సెటైర్లు వేస్తూనే, ‘ఆయనంటే నాకు గౌరవం వుంది..’ అంటూ పవణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
వీటన్నిటినీ బేరీజు వేస్తున్న అధికార వైసీపీ, ఆయా నేతల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. అదే గనుక నిజమైతే, జనసేనాని వ్యూహం ఫలించినట్లే.