టీడీపీతో జనసేనాని.! జనసైనికుల పరిస్థితేంటి.?

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఓ సందర్భంలో జనసేన కార్యకర్తల్నీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్నీ ‘అలగాజనం’ అనేశారు. అలా అన్న నోటితోనే, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు.. అంతే కాదు, పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూశారు.. అదీ అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నానా రకాలుగా తిట్టినోళ్ళు చాలామంది ప్రస్తుతం వైసీపీలోనే వున్నారు. సో, ఈ తిట్టడం.. తిట్టించుకోవడం.. ఇవన్నీ ఓ స్థాయిలో వున్నవారికి పెద్ద ఇబ్బందేమీ కాదు. కానీ, వారిని ఫాలో అయ్యేవారి పరిస్థితేంటి.? అదే అసలు సమస్య.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిపోయారు. అది ఎన్నికల పొత్తు అవుతుందా.? రాజకీయ అవగాహన మాత్రమే అవుతుందా.? అన్నది ముందు ముందు తేలుతుంది. టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే, జనసైనికుల పరిస్థితేంటి.?

కింది స్థాయిలో టీడీపీ – జనసేన మధ్య చాలా గ్యాప్ వుంది.. అదీ కార్యకర్తల స్థాయిలో. ‘అలగాజనం’ అన్న బాలయ్య కామెంటుని, పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇక, చంద్రబాబుని సైతం జనసైనికులు అస్సలు సమర్థించలేని పరిస్థితి.

మరోపక్క, పవన్ కళ్యాణ్ చెప్పారని జనసైనికులు టీడీపీకి ఓటేస్తారేమో.. అది పవన్ కళ్యాణ్ మీద వారికి వున్న గౌరవం. కానీ, టీడీపీ ఓట్లు జనసేనకు పడవ్.! ఎందుకంటే, టీడీపీ లెక్కలు వేరు. 2014 ఎన్నికల్లో జనసేనని వాడుకుని, ఆ తర్వాత జనసేన మీద చంద్రబాబు అండ్ కో చేసిన విమర్శలు ఎలా మర్చిపోగలరు ఎవరైనా.?