మంగళగిరికి మకాం మార్చేసిన జనసేనాని.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా మకాం మంగళగిరికి మార్చేశారట.! జనసేన కేంద్ర కార్యాలయం వ్యవహారాలు ఇకపై మంగళగిరి నుంచే జరుగుతాయట.! హైద్రాబాద్‌ నుంచి అవసరమైన సామాగ్రినంతటినీ మంగళగిరికి తరలించేశారట.!

వాస్తవానికి, తెలంగాణలో జనసేన పార్టీకి కార్యాలయం వుందో లేదో తెలియని పరిస్థితి.! మంగళగిరిలోనే పార్టీ కార్యాలయం వుంది. హైద్రాబాద్‌లో పవన్ కళ్యాణ్ నివాసం నుంచే కార్యకలాపాలు నడుస్తాయి. అది కాకుండా ఫామ్ హౌస్ నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్ని విశ్లేషిస్తుంటారు, సమీక్షిస్తుంటారు జనసేనాని.

ఇంతకీ, ఇప్పుడీ మార్పు దేనికి.? అంటే, 2024 ఎన్నికలే లక్ష్యంగా, ఇకపై వారాహి విజయ యాత్రను పెద్దగా బ్రేకుల్లేకుండా నిర్వహించబోతున్నారట. మరి, చేస్తున్న సినిమాల సంగతేంటి.? అంటే, దానికి తగిన ఏర్పాట్లనూ పవన్ కళ్యాణ్‌కి అందుబాటులో ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు చేయనున్నారు.

అత్యవసరమైతే తప్ప, హైద్రాబాద్‌కి పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం లేదట.! ఇది జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నమాట. కానీ, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఎక్కువ రోజులు వుండొచ్చేమోగానీ, ఆయన హైద్రాబాద్ రాకుండా.. ఏ వ్యవహారమూ ముందుకు నడవదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఇదివరకటిలా ఎక్కువ రోజులు హైద్రాబాద్‌లో వుండి, తక్కువ రోజులు ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం కాకుండా.. ఇకపై, ఎక్కువ రోజులు మంగళగిరిలో వుంటూ, తక్కువ రోజులు హైద్రాబాద్‌లో ఆయన వుంటారని తెలుస్తోంది. మకాం.. అంటే, కుటుంబంతో కదా.! మరి, కుటుంబం సంగతేంటి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.