జనసేనాని పవన్ కళ్యాణ్ అతి పెద్ద తప్పిదం.!

తెలిసో తెలియకో.. చాలా చాలా పెద్ద తప్పిదం చేసేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.! వాలంటరీ వ్యవస్థపై అత్యంత జుగుప్సాకరమైన విమర్శల్ని జనసేన అధినేత చేయడం వెనుక అసలు కారణమేంటి.? సమాచార లోపమా.? కావాలనే ఆయన ఈ వివాదాన్ని కొనితెచ్చుకున్నారా.?

కారణం ఏదైతేనేం.. వాలంటరీ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యల పట్ల వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిష్టబొమ్మల దహనాలతో సరిపెట్టడంలేదు, పోలీసులకు పిర్యాదు చేసేందుకూ సమాయత్తమవుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగానే వాలంటీర్లు వున్నారు. సంక్షేమ పథకాల్ని సమర్థవంతంగా ప్రజలకు అందేలా చేయడంలో వాలంటీర్ వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తోంది.

కేవలం 5 వేల రూపాయల గౌరవ వేతనానికి పని చేస్తున్నారు గ్రామ వాలంటీర్లు. చిన్న విషయం కాదిది. సరే, 2 లక్షల మందిలో, కొంతమంది తప్పుడు విధానాలు అనుసరిస్తుండొచ్చు. వారిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే వుంది. అద్భుతంగా పనిచేస్తున్నవారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది.

వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజా ప్రతినిథులు కొందరు ప్రజల్లో పలచనవుతున్నారు. ఎందుకంటే, వాలంటీర్లే.. సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు చేరువగా వుంటున్నారు మరి.! దీనిపై ప్రజా ప్రతినిథులు గుస్సా అవుతున్నా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం వాలంటీర్ వ్యవస్థ పని తీరు పట్ల సంతృప్తిగా వున్నారు.

కార్యాలయాల చుట్టూ.. ప్రజా ప్రతినిథుల చుట్టూ తిరగాల్సిన పని తప్పిందంటూ ప్రజలు చెబుతున్నారంటే, వాలంటీర్ వ్యవస్థ సమర్థత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడమంటే.. చేజేతులా, చాలా ఓట్లను ఆయన దూరం చేసుకున్నట్లే. రాజకీయంగా అత్యంత ఖరీదైన తప్పిదం జనసేనాని చేసేశారు.