ప్రభువు.! పల్లకీ.! జనసేనానీ నీకిది అవసరమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కార్టూన్ వదిలారు.! ఆ కార్టూన్‌‌లో పల్లకీ మీద కూర్చున్నారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంత్రులు, ఉన్నతాధికారులూ ఆ పల్లకీని మోస్తున్నారు.

సరే, ఆ కార్టూన్‌లో ఏం రాశారన్నది వేరే చర్చ. ఇందులో వింతేముంది.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ముఖ్యమంత్రి కూర్చున్న పల్లకీని మంత్రులు, అధికారులు మొయ్యాల్సిందే.! రేప్పొద్దున్న కాలం కలిసొచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా, అదే జరుగుతుంది.

అధినేత మెప్పు కోసం నేతలు నానా తంటాలూ పడుతుంటారు. అధికార పార్టీ నేతలు మరీనూ.! ముఖ్యమంత్రి పల్లకీని మోయాలని అధికారులు అనుకోవడంలో వింతేముంది.? ఇప్పుడున్న వ్యవస్థే అలా తగలడింది. రాత్రికి రాత్రి ఈ వ్యవస్థ మారిపోదు.

ఏ ఉద్దేశ్యంతో ఈ కార్టూన్ జనసేనాని వేశారోగానీ, అది ఆయనకే రివర్స్ కొట్టేస్తోంది. ‘మేమైతే మా నాయకుడికి పల్లకీని మోస్తున్నాం. మరి, నువ్వేం చేస్తున్నావ్.? నీతో సహా, మీ పార్టీ నాయకులంతా చంద్రబాబు పల్లకీ మోస్తున్నారు కదా..’ అంటూ వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి జనసేన అధినేత మీద.

జనసేనానికి ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారోగానీ, ముందుగా అలాంటి వాళ్ళ మీద జనసేనాని ఫోకస్ పెడితే మంచిది. ఆత్మవిమర్శ చేసుకోవడం ఉత్తమం. కార్టూన్లు ఆపి, జనంతో మమేకమవడం జనసేనాని నేర్చుకోవాల్సి వుంది.