జనసేనాని టార్గెట్ పెద్దదే.! కానీ, ఛేదించేదెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చారు.. ఏపీ రాజకీయాల్లో కొంత అలజడి కనిపించింది. జనసేన శ్రేణుల్లో ఊపు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అంతా షరామామూలే.! ఇది మొదటి సారి కాదు. చాలాసార్లు జరిగింది, జరుగుతూనే వుంది. మూడు నెలలకో, ఆరు నెలలకో ఏపీ రాజకీయాల్లో గెస్ట్ రోల్ పోషించడమే జనసేనాని వ్యవహార శైలి.. అంటూ రాజకీయ విశ్లేషకులు ఊరకనే విమర్శించరు.

వైసీపీ నేతలు విమర్శిస్తోంటే, ఆ వైసీపీ నేతలపై జనసేన నేతలు కొందరు కౌంటర్ ఎటాక్ ఈ మధ్య కాస్త గట్టిగానే చేస్తున్నారు. అదొక్కటే, గడచిన మూడేళ్ళలో.. కాదు కాదు, గడచిన ఎనిమిదేళ్ళలో జనసేన పార్టీలో వచ్చిన మార్పు. అంతకు మించి, గట్టిగా జనసేనలో వున్న ప్రముఖ నాయకులెవరన్నది మాత్రం తెలియడంలేదు.

‘మాకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాబోతోంది..’ అంటూ జనసేన కొత్త పల్లవి అందుకుంది. అది అసలు సాధ్యమయ్యే పనేనా.? పట్టుమని పది రోజులు ఏకధాటిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వుండలేకపోతున్నారు.
వరుసగా ఓ మూడు నాలుగు నెలలు రాష్ట్రంలోనే వుండి, రాష్ట్ర నాయకులతో మంతనాలు జరుపుతూ, కింది స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసి, అవసరమైతే వారానికో, పది రోజులకో ఆయా జిల్లాలకు వెళ్ళి, స్థానిక నాయకుల్లో జోష్ పెంచాలన్న కనీస ఆలోచన కూడా జనసేనాని చేయడంలేదాయె.

వాస్తవానికి ఇదంతా, జనసేనాని రాష్ట్ర పర్యటనకు ముందు నడవాల్సిన వ్యవహారాలు. కానీ, అవేవీ జరగడంలేదు. అయినాగానీ, వచ్చే ఎన్నికల్లో తమే అధికారమంటున్నారు జనసేనాని. టార్గెట్ బావుంది.. కానీ, దాన్ని ఛేదించేదెలా.?