రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏపీలో జనసేనకు ఒకే ఒక జడ్పీటీసీ ఉన్నారు. ఆ ఒకే ఒక్క జడ్పీటీసీ తాజాగా వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం నుంచి జడ్పీటీసీగా ఎంపికైన గుండా జయప్రకాష్ నాయుడు తెలంగాణ సర్కార్ ను మోసం చేసిన కేసులో వివాదంలో చిక్కుకున్నారు. రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లను దక్కించుకున్న ఈ జడ్పీటీసీ తెలంగాణలోని 12 జిల్లాలలో వేర్వేరు పేర్లతో టెండర్లను దక్కించుకున్నారు. అయితే ఇతను అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశాడని విచారణలో తేలింది.
అదే సమయంలో బ్యాంకు గ్యారెంటీ సైతం నకిలీ అని ప్రూవ్ కావడంతో ఇతనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అవినీతి లేని రాజకీయాలు చేయాలని పవన్ పదేపదే చెబుతుండగా ఆయన పార్టీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ పార్టీ పరువు తీస్తున్నారు. జనసైనికులు కూడా పలు ప్రాంతాలలో వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయాలలో సంచలనాలు సృష్టించాలని పవన్ భావిస్తుండగా ఇలాంటి ఘటనలు ఆయన పొలిటికల్ కెరీర్ కు మైనస్ అవుతున్నాయి. జనసేన రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తుండగా జరుగుతున్న ఘటనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ ఘటన గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జనసేన నేతలు చేస్తున్న పనులు పవన్ కు శాపంగా మారుతున్నాయి.