తన రాజకీయ శతృవులందర్నీ ఒకే గాటన కట్టేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటు. అది జాతీయ స్థాయి నేతలైనా సరే! ఇందుకు ఆయన వెనుకాడడు. ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పనిలో పనిగా మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ..ఇలా అందరూ తనపై కుట్ర చేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారనే విమర్శలు ఆయన నోటి నుంచి చాలాసార్లు వినిపించాయి.
తాజాగా- జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా అదే రాగాన్ని అందిపుచ్చుకున్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒక్కటేననే ప్రచారాన్ని మొదలు పెట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ఈ విషయాన్నే చాలాసార్లు ప్రస్తావించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏపీలో మహాకూటమిని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
టీఆర్ఎస్‌తో జగన్‌కు ఎందుకంత అనుబంధం అని ప్రశ్నించారు. చంద్రబాబు మీద కక్ష సాధించడానికే జగన్ కేసీఆర్‌తో చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో మానుకోటలో టీఆర్ఎస్ నాయకులు జగన్ పర్యటనను అడ్డుకున్న విషయాన్ని మరిచిపోయారా? అంటూ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్.. టీఆర్ఎస్‌తో చేతులు కలపడం తనకు భయాందోళనలకు గురి చేస్తోందంటూ చెప్పుకొచ్చారు.