జగన్ ను ఆకాశానికెత్తేసిన జనసేన ఎంఎల్ఏ

అసెంబ్లీలో విచిత్రమైన దృశ్యం ఆవిష్కృమైంది. ప్రతిపక్షం అంటే అధికార పార్టీని ప్రతి విషయంలోను వ్యతిరేకించటమే పనిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిరూపితమైంది. బడ్జెట్ పై అసెంబ్లీలో జరిగిన చర్చలో జనసేన ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఆకాశానికెత్తేశారు.

వైసిపి మ్యానిఫెస్టోలో మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అంటూ పొగిడారు. జాలర్ల సంక్షేమానికి భారీ ఎత్తున నిధులు కేటాయించిన జగన్ ను జాలర్లు దేవుడితో సమానంగా చూస్తున్నారంటూ చెప్పటం గమనార్హం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాపాక కూడా మొన్నటి ఎన్నికలకు ముందు వరకూ వైసిపి నేతే.  తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు లో వైసిపి తరపున పోటీ చేసేందుకు టికెట్ దక్కలేదు. దాంతో వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాట్లాడుకుని టికెట్ ఖరారు చేసుకుని జనసేనలో చేరిపోయారు. అక్కడి నుండి పోటీ చేసి సుమారు 800 ఓట్త మెజారిటితో గెలిచారు.

ఎప్పుడైతే వైసిపి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి రాపాక మనస్సంతా వైసిపి వేపే చూస్తోంది. అదే సమయంలో జగన్ కు కూడా బాగా సన్నిహితుడు కావటంతో  జగన్ గురించి సభలో కానీ బయట కానీ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. దాన్ని తెలుగుదేశంపార్టీ సభ్యులు తట్టుకోలేకున్నారు. అందుకనే రాపాకను జగన్ సేన ఎంఎల్ఏ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.