గత ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున రాజోలు నియోజకవర్గం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైనట్లుగా ఉంది. జనసేన నుంచి గెలిచిన మొదట్లో ఆయన చెప్పిన డైలాగులు విన్న జనసేన సైనికులు గెలిచినవాడు ఒక్కడైనా వీడు ఒక్కమగాడు అని అనుకున్నారు . కానీ కొన్నాళ్ళకే అసలు రంగు బయటపెట్టి అందరు అవాక్కయ్యేలా చేశారు రాపాక. అధికార వైసీపీ తొత్తుగా మారి జగన్ నామ స్మరణ చేస్తూ వైసీపీ పార్టీలోకి జాయిన్ అవ్వటానికి బాగా ట్రై చేస్తున్నారు. కానీ రాపాకకు వైసీపీ పార్టీలో సరైన ఆదరణ మాత్రం లభించడం లేదు.
రాజోలులో ఎలాగైనా పార్టీ మీద పట్టు సాధించడానికి రాపాక ప్రయత్నాలు చేస్తున్నా ఏమీ ఫలించడంలేదు. జనసేన నుంచి గెలిచి వైసీపీకి మద్దతిస్తే తప్పేంటంటూ జనసేన మద్దతుదారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తుండటంతో వారు పట్టించుకోవడం మానేశారు. పోనీ వైసీపీ నేతగా చెలామణి కావడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావడంలేదు. ఆయన్ను వైసీపీ నేతగా అంగీకరించడానికి పార్టీ కేడర్ అస్సలు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో తాను వైసీపీ నేత అని చెప్పుకోవడానికి వీలుగా తనయుడు వెంకట రామ్ ని అధికార పార్టీలో చేర్పించారు. ఇవన్నీ అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా పరిణమించాయి.
ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలోని వైసీపీలో రెండు వర్గాలున్నాయి. ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీ పార్టీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన బొంతు రాజేశ్వరరావుకు మరో వర్గం ఉంది. ఇప్పటికే అమ్మాజీకి పదవి రావడంతో ఆమె అజమాయిషీ పెరిగింది. ఇది రాజేశ్వరరావుకు మింగుడుపడటంలేదని అంటున్నారు. ఇలా ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా.. ఇప్పుడు రాపాక సైతం రంగంలోకి దిగడంతో రాజోలులో వైసీపీ కేడర్ సతమతమవుతోంది. మరోవైపు రాపాక పరిస్థితి మాత్రం దారుణంగానే ఉందని చెబుతున్నారు. అటు జనసేన కార్యకర్తలకు దూరమై.. ఇటు వైసీపీ కేడర్ కు దగ్గర కాలేక ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో ఆయన ఉన్నారట. చేసుకున్నవారికి చేసుకున్నంత అని ఊరికే అనలేదని జనసైనికులు నవ్వుకుంటున్నారని సమాచారం.