రాపాక 10కోట్ల ఆరోపణ… జగన్ కి బాబు దొరికేసినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిపోయాయి.. ఫలితాలొచ్చేశాయి. అయినా కూడా ఆ ఎన్నికల రగడ మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇంగా గటిగా చెప్పాలంటే… ఎన్నికల ఫలితాలైతే వెంటనే వచ్చేశాయి కానీ… ఆ ఎన్నికల మూలంగా ఏర్పడిన రాజకీయ రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ ఎన్నికల్లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేయడంతో వైసీపీ అభ్యర్థి కోలా గురువులు ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో బలం లేకపోయినప్పటికీ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్న వైసీపీ అధిష్టానం… క్రాస్ ఓటింగ్ చేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకల చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఉన్నారు. వీళ్ళు డబ్బులకు అమ్ముడు పోయారని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని ఈ నలుగురూ ఖండించారు. డబ్బుకు అమ్ముడుపోయామని నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు.

సరిగ్గా ఈ సమయంలో మైకులముందుకు వచ్చారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి అభ్యర్థికి ఓటు వేస్తే పది కోట్ల రూపాయలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ తనకు ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాపాక తన కార్యకర్తలతో మాట్లాడుతూండగా తీసిన ఒక రహస్య వీడియోను ఓ తెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. అందులో ఆయన స్పష్టంగా టీడీపీ నుంచి తనకు పది కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని చెప్పారు. దీంతో.. వరప్రసాద్ వివిధ ఛానళ్ళతో మాట్లాడుతూ… తాను చెప్పిన మాటలు నిజమేనని, టీడీపీ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే మంతెన రామరాజు తనకు ఈ ఆఫర్ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.

అయితే తాను మాత్రం జగన్ నే నమ్ముకున్నానని, ఆయనతోనే నడుస్తానని చెప్పి.. రామరాజు ఆఫర్ ను తిరస్కరించానని వరప్రసాద్ తెలిపారు. మరో వైపు వరప్రసాద్ ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఖండించారు. తాను రాపాకకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని అన్నారు. తాను అసలు రాపాకను ఎప్పుడూ విడిగా కూడా కలవలేదని ఆయన అన్నారు.

దీంతో “కొనడం – అమ్ముడుపోవడం” అనే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే రాపాక చెబుతున్నమాట నిజమే అయితే మాత్రం… ఈ విషయాన్ని వైసీపీ అధిష్టాణం లైట్ గా తీసుకునే పరిస్థితి ఉండదు. రామరాజు పేరు చెప్పి చంద్రబాబు & కో లతో పాటు.. వైకాపా నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలను ఏకిపారేసే పరిస్థితి ఉంది! ఇప్పటికే ఈ వ్యవహారంపై కారాలు మిరియాలూ నూరుతున్న వైకాపా అధిష్టాణం రాపాక స్టేట్ మెంట్ పై విచారణకు ఆదేశించే అవకాశం ఉంది!

TDP Offered 10 Crores For MLC Election | MLA Rapaka Varaprasad | Ntv