పోలిస్టేషన్ పైనే ఎంఎల్ఏ దాడి

ప్రజా ప్రతినిధులు తమ స్ధాయిని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. నలుగురికి బుద్ధులు చెప్పాల్సిన స్ధానంలో ఉన్న  ఎంఎల్ఏలే ఎంత తోస్తే అంత చేస్తున్నారు. తాజాగా రాజోలు జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ చేసిన పని అలాగే ఉంది. పేకాటాడుతున్న తన మద్దతుదారులను పోలీసులు పట్టుకున్నందుకు నిరసనగా ఎంఎల్ఏ పోలీసు స్టేషన్ పైనే దాడి చేసి కలకలం సృష్టించారు.

పబ్లిగ్గా పేకాటాడటం తప్పన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఏ పదిమంది ఎంఎల్ఏ దన్ను చూసుకుని మలికిపురం గెస్ట్ హౌస్ లో పేకాటాడుతున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మోటారు సైకిళ్ళు, డబ్బు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో విషయం తెలియగానే ఎంఎల్ఏ వెంటనే పోలీసులతో మాట్లాడారు. స్వాధీనం చేసుకున్న మోటారుసైకిళ్ళు, డబ్బును ఇచ్చేయటంతో పాటు అందరినీ వదిలేయాలని ఆదేశించారు.

అయితే పోలీసులు వినలేదు. కావాలంటే స్టేషన్ కు వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తామని చెప్పి తీసుకెళ్ళిపోయారు. దాంతో ఒళ్ళు మండిపోయిన ఎంఎల్ఏ తన అనుచరులను వెంటేసుకుని వెళ్ళి పోలీసుస్టేషన్ పై దాడి చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం చెప్పారు.

పోలీసు స్టేషన్ పై రాళ్ళు రువ్వటంతో పాటు కిటికీలను పగలగొట్టినందుకు రాపాకతో పాటు మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు రాపాక ప్రవర్తన విచిత్రంగా ఉంది. పేకాటాడి తప్పు చేసిన మద్దతుదారులకు బుద్ధి చెప్పాల్సింది పోయి పట్టుకున్న పోలీసులపై దాడి చేయటమేంటో ఎవరికి అర్ధం కావటం లేదు. అంటే ఎంఎల్ఏ అంటే ఏమి చేసినా చెల్లుబాటవుతుందన్నట్లుగా ఉంది కొందరి వ్యవహారం.