ట్రాక్ తప్పుతున్న జనసేన.! ఇలాగైతే కష్టమే.!

2024 ఎన్నికల్లో గెలిచి అధికార పీఠమెక్కుతామంటోంది జనసేన పార్టీ. అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేంత సీన్ వుందా.? అంటే, ఆ పార్టీ వద్ద సరైన సమాధానం లేదు. రాష్ట్రంలో హంగ్ వస్తే, ఆ గందరగోళంలో అధికార పీఠమెక్కాలన్న ఒకే ఒక్క ఆలోచన తప్ప, నేరుగా అధికార పీఠమెక్కేంత సీన్ లేదని జనసేన పార్టీకీ తెలుసు. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయం.. ఈ రెండు పడవల ప్రయాణంలో, జనసేన అధినేతను కేవలం సినీ నటుడిగానే ఓటర్లు చూస్తున్నారు తప్ప, రాజకీయ నాయకుడిగా ఆయన్ని ఆశీర్వదించలేకపోతున్నారు.

సినిమాలకీ న్యాయం చేయలేక, రాజకీయాలకీ న్యాయం చేయలేక పవన్ కళ్యాణ్ సతమతమవుతున్న పరిస్థితి కళ్ళముందు కనిపిస్తోంది. నిజానికి, ఇదేమీ తప్పు కాదు. కానీ, నడుస్తున్న రూట్ మాత్రం ముమ్మాటికీ తప్పే. ఇప్పటం గ్రామ వివాదాన్నే తీసుకుంటే, జనసేన పార్టీ ఇక్కడ వెర్రి వెంగళప్ప అయిపోయింది. ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందనీ, ఆ విషయాన్ని ముందే గ్రామస్తులు కోర్టుకు చెప్పలేదనీ తేలిపోయాక, జనసేనలో పూర్తి స్తబ్దత నెలకొంది.

ఇలా ఎలా బోల్తాపడ్డాం.? అని జనసేనాని, పార్టీ శ్రేణులకు క్లాస్ తీసుకున్నారట. బాధితులకు జనసేనాని లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాల్సి వుండగా, కోర్టు.. ఆ పిటిషన్‌దారులకి లక్ష రూపాయల చొప్పున జరీమానా విధించింది. కింది స్థాయిలో పార్టీ యంత్రాంగం, పూర్తిస్థాయిలో నిజానిజాలు తెలుసుకోకపోవడంవల్లే తమకు సంకటం వచ్చిందని జనసేన అధినేత భావిస్తున్నారట. చాలా విషయాల్లో జనసేన ఇలాగే పల్టీలు కొడుతోంది.