జనసేన ఫిర్యాదుల్లో పస ఎంత.?

నిజమే, రాజకీయాల్లో జుగుప్స పెరిగిపోయింది. ఆ పార్టీ.. ఈ పార్టీ.. ఇలాంటి తేడాలేమీ లేవు. అన్నీ ఒకటే బాపతు. కాస్త ఎక్కువ.. కాస్త తక్కువ.. అంతే తేడా.! చంద్రబాబు సతీమణి, పవన్ కళ్యాణ్ సతీమణి, వైఎస్ జగన్ సతీమణి.. వీళ్ళు రాజకీయాల్లో లేకపోయినా, వీరి మీద అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని రాజకీయ ప్రత్యర్థులు వాడుతున్నారు.

అధికారంలో వున్న పార్టీ మీద బాధ్యత ఎక్కువ వుంటుంది. కానీ, ఏం చేయలేని పరిస్థితి. బాధ్యతారాహిత్యం.! చేయాలనుకుంటే, పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేసి, అవాకులు చెవాకులు పేలుతున్నవారిపై కేసులు పెట్టించి, లోపల వేయించొచ్చు. కానీ, ఈ విషయంలో అధికార వైసీపీకి చిత్తశుద్ధి లేదు.

గతంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది గనుక, దాన్ని తాము కొనసాగిస్తున్నామన్నట్లుంది వైసీపీ తీరు. పోలీసులూ అంతే.. అప్పట్లో ఆ ప్రభుత్వం చెప్పింది చేశాం.. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెబుతున్నట్లు చేస్తున్నాం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యకు విడాకులిచ్చేశారన్నది ఓ గాలి వార్త. దాని మీద జరిగిన, జరుగుతున్న యాగీ అంతా ఇంతా కాదు. అభ్యంతకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన మీడియా సంస్థలకీ, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకీ నోటీసులు ఇచ్చే దిశగా న్యాయ పోరాటం షురూ చేసింది జనసేన. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు జనసేన మహిళా నేతలు.

ఈ క్రమంలో టీడీపీ అను‘కుల’ మీడియా మీద జనసేన పెద్దగా ఆరోపణలు చేస్తున్నట్లు కనిపించడంలేదు. అదే విచిత్రం అంటే. ఈ తరహా కేసులు.. పోలీసు వ్యవస్థకి ఓ సవాల్. అరెస్టు చేసుకుంటూ పోతే, వందలు వేలు కాదు.. లక్షల్లో వుంటారు. పిల్లి మెడలో గంట కట్టేదెలా.? సాధ్యమయ్యే పనే కాదది.!