జనసేన గ్రాఫ్ పెరిగిందా.? దానికి వారాహి విజయ యాత్ర కారణం కాదా.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లనే జనసేన పార్టీ గ్రాఫ్ పెరిగిందనడంలో నిజమెంత.?
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తొలి దశల ‘వారాహి విజయ యాత్ర’ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పూర్తయిన వారాహి విజయ యాత్ర, పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతోంది.
సరిగ్గా, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావనను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ప్రస్తావనకు తీసుకొచ్చారు.? అది కూడా, పసి పిల్లలకు సంబంధించిన కార్యక్రమంలో.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
‘ముందైతే స్క్రిప్టు రాసిస్తున్న వ్యక్తినీ, సలహాదారుల్నీ మార్చండి..’ అన్న వెటకారపు సూచన, జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపుకు దూసుకొచ్చింది. దానికి అనుగుణంగా వైసీపీలోనూ కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో అలాంటి ఆలోచన లేకుండా, స్క్రిప్టు తయారవుతుందా.? ఛాన్సే లేదు. అంటే, వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లే. ఒక్క చిన్న పొరపాటు.. రాజకీయాల్లో చాలా చాలా ఖరీదైన తప్పిదంగా మారిపోతుంది.
అమ్మ ఒడి కార్యక్రమానికి నిధులు విడుదల చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావనను వైఎస్ జగన్ తెచ్చి వుండకూడదు. అది అధికారిక కార్యక్రమం. బోల్డంత ప్రజాధనం ఖర్చు చేసి నిర్వహించిన బహిరంగ సభ. అలా ఎలా వైఎస్ జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారబ్బా.?