జమిలి ఎన్నికలొచ్చినా.. లేదంటే, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగినా.. ఆంధ్రపదేశ్‌లో తదుపరి అధికారంలోకి వచ్చేది తామేనని జనసేన – బీజేపీ ముక్త కంఠంతో చెప్పేస్తున్నాయి. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించబోతున్నారనీ, అదే జనసేన – బీజేపీ, రాష్ట్రంలో సాధించబోయే తొలి అతి పెద్ద విజయమని ఇటు బీజేపీ, అటు జనసేన.. కుండ బద్దలుగొట్టేస్తున్నాయి. అక్కడిదాకా ఎందుకు.? పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటెయ్యొచ్చు కదా.. అని అధికార పార్టీ నుంచి సెటైర్లు గట్టిగానే తెరపైకొస్తుండడం గమనార్హం. అదీ నిజమే. అసలు, పంచాయితీ ఎన్నికల్లో ఎక్కడా జనసేన – బీజేపీ హంగామా కనిపించడంలేదు.
‘మా పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతోంటే, వారిని బలవంతంగా అడ్డుకుంటున్నారు.. వారిపై అడ్డగోలు కేసులు పెడుతున్నారు..’ అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా ఆరోపించారు. జనసేన నేతలదీ ఇదే తీరు. అయితే, పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగవు. ఎవరు గెలిచినా.. ఆ గెలుపుని ఫలానా పార్టీ తన ఖాతాలో వేసుకునే పరిస్థితి వుండదు. ఒకవేళ వేసుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. పంచాయితీ ఎన్నికల్లో గెలిచేవారిని ఎటూ అధికార వైసీపీ తన వైపుకు తిప్పకుంటుంది. ఇది ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో సహజంగానే జరిగే ప్రక్రియ. ఈ మాత్రందానికి అధికార పార్టీ అత్యుత్సాహం చూపడం కూడా దండగే. కానీ, పంచాయితీ ఎన్నికలకి వుండే పొలిటికల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ కారణంగానే గతంలో ఎన్నడూ లేనంత గందరగోళంగా ఈసారి పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి.. ఇటు జనసేనకీ, అటు బీజేపీకి.. పంచాయితీ ఎన్నికలు అత్యంత ప్రత్యేకమైనవి. గ్రామ స్థాయిలో తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. కానీ, ఇక్కడే చేతులెత్తేసి, అధికార పార్టీ మీద అక్కసు వెల్లగక్కితే, బీజేపీ – జనసేన పార్టీల శ్రేణులకు దిక్కెవరు.?