జనసేన పార్టీకి అదే బలం.! అదే బలహీనత.!

ఓ రాజకీయ పార్టీకి వుండాల్సిన కనీస లక్షణాలేవీ జనసేన పార్టీలో కనిపించడంలేదు.! ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలకు వుండాల్సిన కనీస లక్షణాలేవీ జనసేన పార్టీ కార్యకర్తల్లో కనిపించడంలేదు.! ఓ రాజకీయ పార్టీ అధినేతకు వుండాల్సిన కనీస లక్షణాలేవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో కనిపించడంలేదు.!

అసలు ఆ లక్షణాలు ఏంటి.? అంటే, రాజకీయం మారింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళారు. అయినాగానీ, ఆయన్ని కొందరు నాయకులు నమ్మారు. ఆయన్ని అభిమానించే అభిమానులూ నమ్మారు.!

‘మా నాయకుడి మీద అక్రమ కేసులు బనాయించారు’ అంటూ బలంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు జనాల్ని నమ్మించగలిగారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ‘రాజకీయ వెన్నుపోటు’ ద్వారానే రాజకీయంగా ఎదిగారు. స్వర్గీయ ఎన్టీయార్‌ని రాజకీయంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచినా, చంద్రబాబుని టీడీపీ నాయకులు, క్యాడర్ నమ్మింది.! చంద్రబాబుని వెనకేసుకొచ్చింది.

కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని జనసైనికులే నమ్మడంలేదు. టీడీపీని కమ్మ సామాజిక వర్గం నమ్మినట్లు, వైసీపీని రెడ్డి సామాజిక వర్గం నమ్మినట్లు, కాపు సామాజిక వర్గం జనసేన పార్టీని నమ్మడంలేదు.!

ఇవా రాజకీయ పార్టీలకి వుండాల్సిన లక్షణాలు.? అంటే, ముందే చెప్పుకున్నట్టు రాజకీయం మారింది. దానికి తగ్గట్టుగా నాయకులూ మారాలి. అధినేత అంటే, పార్టీ ముఖ్య నేతలకు అందుబాటులో వుండాలి. అమావాశ్యకో, పున్నమికో రాజకీయాల్లో కనిపించే వాళ్ళని ‘నాయకుడు’ అని ఎలా అనగలం.?

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయమై నారా లోకేష్ వ్యాఖ్యలతో జనసేన శ్రేణులు అలజడికి గురయ్యాయి. అప్పటిదాకా జనసేనానికి వెన్ను దన్నుగా నిలిచిన చేగొండి హరిరామ జోగయ్య, లేఖాస్త్రం సంధించేశారు. దాంతో మరింత దుమారం చెలరేగింది. ప్రస్తుతానికి రగడ కాస్త చల్లారినట్టే.

కానీ, కార్యకర్తల్లో గందరగోళం.. నాయకుల్లో గందరగోళం.. అధినేతలో గందరగోళం.! ఇలాగైతే రాజకీయం ఎలా.? జనసేన పార్టీకి పవన్ కళ్యాణే బలం.. పవన్ కళ్యాణే బలహీనత.! జనసేన నాయకులూ అంతే. కార్యకర్తలు, అభిమానులు కూడా సేమ్ టు సేమ్.!