ప్రకటనల జనసేనాని.. ఇవేం రాజకీయాలు మహాప్రభో.!

ఇవేం రాజకీయాలు చెప్మా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.. అయినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తనదైన రాజకీయాలు చేసుకుంటూనే వెళుతున్నారు. ఓ రాజకీయ పార్టీకి అధినేత అయినప్పుడు.. ఆయన మీడియా ముందుకొచ్చి, తాను చెప్పదలచుకున్నది చెప్పాలి. లేదంటే, పార్టీ వేదికల ద్వారా ప్రజలకు సందేశమివ్వాలి. సరే, సందర్భానుసారం ప్రెస్ నోట్లతో చెప్పాలనుకున్న విషయం చెబితే.. అది తప్పు కాదు. కానీ, పదే పదే ప్రెస్ నోట్లతో సరిపెడితే ఎలా.? రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన అధినేత తాజాగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నది జనసేనాని ఆరోపణ.

ఈ నెలాఖరులోగా ప్రతి గింజకూ డబ్బు చెల్లించాలని జనసేన అధినేత డిమాండ్ చేసేశారు. ప్రభుత్వం, రైతులకు ఏకంగా 3 వేల కోట్లకు పైగా బకాయి పడిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంతేనా, అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడే వారికి మాత్రం వెంటనే చెల్లింపులు చేస్తున్నారన్నది జనసేన అధినేత చేసిన మరో కీలక ఆరోపణ. పండించే పంటకి.. తినే తిండికి రాజకీయ రంగు పులమడమా.? అని నిలదీసేశారు. రైతుల పక్షాన జనసేన నిలబడుతుందని తేల్చి చెప్పారు. వావ్.. ఈ మాటేదో, జనసేన అధినేత మీడియా ముందుకొచ్చి చెబితే బావుండేది కదా.? పోనీ, మీడియా ముందుకు రాలేకపోతే.. పార్టీ వేదికల మీద నుంచైనా మాట్లాడొచ్చు కదా.? కానీ, అలా రావడం జనసేనానికి కొంత కష్టమైన వ్యవహారం. ఎందుకంటే, ఆయన సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఓ వైపు సినిమా ఇంకో వైపు రాజకీయం అంటే ఇలాగే వుంటుంది మరి. కరోనా నేపథ్యంలో కాస్తంత బాధ్యతగా వుండాలి గనుక, జనసేనాని రిస్క్ తీసుకోవట్లేదు, ప్రజల్ని రిస్క్‌లో పెట్టదలచుకోలేదంటూ జనసైనికులు కవర్ చేసుకోవాల్సి వస్తోంది.