సిబిఐని రాష్ట్రంలోకి అనుమతి నిరాకరిస్తు చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమైనా జరుగుతుందేమోననే చంద్రబాబు సిబిఐని రానీయకుండా నిర్ణయం తీసుకున్నట్లుందని జైట్లీ వ్యాఖ్యానించారు. సిబిఐ ద్వారా చంద్రబాబుకు ఏమవుతుంది ? అయితే విచారిస్తుంది లేకపోతే అరెస్టు చేస్తుంది అంతే కదా ? చంద్రబాబును విచారించటమో లేకపోతే అరెస్టు చేయటమే చేసే అవకాశం ఉందా ? జైట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి.
మొత్తానికి సిబిఐని అనుమతించే విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై కేంద్రం స్పందించింది. చంద్రబాబు నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు, ఆరోపణలు ముసురుకుంటున్నా కేంద్రం మాత్రం శనివారం మధ్యాహ్నం వరకూ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇఫుడు కూడా మాట్లాడాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కాకుండా జైట్లీ స్పందించటం గమనార్హం. తన తప్పులను కప్పిపుచ్చుకోవటానికే సిబిఐని రాష్ట్రంలోకి అనుమతించకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు జైట్లీ అభిప్రాయపడ్డారు.
అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికి సార్వభౌమాధికారం లేదని జైట్లీ చెప్పటమే విచిత్రంగా ఉంది. నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ నిర్ధారించిన విషయం తెలిసిందే. కాగ్ నిర్ధారించటం కాకుండా బిజెపి నేతలు కూడా చంద్రబాబుపై ఎన్నో ఆరోపణలు చేసి తమ ఆరోపణలకు ఆధారాలను కూడా అందించారు. అయినా కేంద్రం నుండి ఎటువంటి చలనం కనబడలేదు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్రపథకాల్లో కూడా అవినీతి జరిగిందని గోల జరుగుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. అటువంటిది అవినీతిపై ఏ రాష్ట్రానికి సార్వభౌమత్వం లేదని చెప్పటమే విడ్డూరంగా ఉంది.