బీజేపీ విషయంలో ఓపెన్ అయిపోయిన జగన్… ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఫుల్ క్లారిటీ!

తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఏనాడూ కేంద్ర పెద్దలను ఒక్క మాట కూడా జగన్ విమర్శించలేదు. వీలైనంత వరకూ సఖ్యత పాటిస్తూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకున్నారు. ఈ మధ్య ఆ విషయంలో బాగా సక్సెస్ కూడా అయ్యారు. దీంతో ఆర్థిక సహకారం అందిస్తూ జగన్ తో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తుందనే కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఆ కథనాలకు జగన్ బ్రేక్ వేశారు.

తాజాగా ఏపీలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. తమకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయని తెలిపారు. దీంతో… జగన్ కి బీజేపీకి మధ్య పొత్తు లేదనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. అయితే తాజాగా ఆ క్లారిటీని మరింత బలపరిచిన జగన్… తనకు బీజేపీ సహకారం లేదని క్లారిటీ ఇచ్చారు.

అవును… పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించిన జగన్‌ మోహన్ రెడ్డి… తనకు బీజేపీ అండలేదని, తాను నమ్ముకున్నది ప్రజలను మాత్రమేనని స్పష్టం చేశారు. తాను ఎల్లో మీడియా విష ప్రచారం మీద అలాగే అవినీతి అక్రమాల మీద పోరాడుతున్నానని తెలిపారు. ఈ పోరాటంలో తనకు ఎల్లో మీడియా ఎదురు నిలిచించని టీడీపీ దత్తపుత్రుడు కూడా తనకు పూర్తిగా ప్రత్యర్ధులు అని జగన్ అన్నారు. ఇపుడు వారితో పాటు బీజేపీ అండ కూడా తనకు లేదని జగన్ చెప్పుకొచ్చారు.

ఇలా బీజేపీతో జగన్ కు రహస్య ఒప్పందం ఉంది, పొత్తు ఉండబోతుంది అంటూ వస్తున్న కథనాలకు చెక్ పెట్టారు. దీంతో బీజేపీ – టీడీపీ పొత్తు వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. ఫలితంగా… జగన్ ఎలాగూ “నో” చెబుతున్నారు కాబట్టి… ఏపీలో ఎంతో కొంత గుర్తింపు సంపాదించాలంటే టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఏర్పడినట్లయ్యింది.

ఈ లెక్కన చూసుకుంటే… ఇక మనుగడను ప్రశ్నార్థకం చేసుకోకూడదంటే.. ఏపీలో జనసేన – టీడీపీలతో బీజేపీ పొత్తులో వెళ్లడం అనివార్యం అని అంటూన్నారు పరిశీలకులు.