కేంద్రప్రభుత్వం తీసుకోబోయే ఓ నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి ఊహించనిరీతిలో మేలు చేయబోతోంది. అసెంబ్లీ సీట్లను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. అసెంబ్లీ సీట్ల సంఖ్యను 175 నుంది 225కి పెంచాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. దీనికోసం చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ఎంతో ప్రయత్నించారు. అయినా అప్పట్లో కేంద్రం సానుకూలంగా స్పందించలేదు.
తాజాగా కేంద్ర హోంశాఖలో పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను పరిశీలించినపుడు అసెంబ్లీ సీట్లు పెంచే ప్రతిపాదన కూడా బయటపడిందట. దాని విషయంలో కేంద్రమంత్రి అమిత్ షా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ సీట్లు పెంచమని చంద్రబాబు ఎంత అడిగినా కుదరదని చెప్పిన కేంద్రం ఇపుడదే అంశాన్ని పరిశీలిస్తోందంటే ఏమనర్ధం ?
సరే ఆ విషయాన్ని పక్కన పెడితే బిజెపికి రాజకీయంగా పరిస్ధితులు అనుకూలంగా ఉన్న సమయంలో సీట్ల సంఖ్యను పెంచాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. అయితే బిజెపి నాయకత్వం ఇక్కడే ఓ విషయాన్ని మరచిపోయింది. సీట్ల సంఖ్య ఎంతకు పెంచినా తగ్గించినా బిజెపి బలపడేదైతే ఏమీ లేదు. మొన్నటి ఎన్నికల్లో 175 సీట్లకు బిజెపి పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 0.84 శాతం.
సీట్ల సంఖ్యను పెంచితే బిజెపి బలోపేతమవుతుందని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటుండదు. సీట్ల సంఖ్య పెరిగితే బిజెపి, కాంగ్రెస్, టిడిపి, జనసేన, వామపక్షాలకు కష్టాలు పెరుగుతాయే కానీ ఏమాత్రం లాభముండదు. లాభపడేది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
