ఏపీ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వారికి కాస్త ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ ల్యాబుల్లో జరిపే కరోనా RT-PCT కోవిడ్ 19 టెస్టుకు రూ.499 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు. ఇప్పటివరకూ ఈ ధర రూ.1000గా ఉండేది. దీన్ని 50 శాతానికి తగ్గించడం మంచి విషయమే.
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు బాగా తగ్గాయి. కొత్త కేసులు చాలా తక్కువగానే వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. తాజా మార్పుల వల్ల ప్రభుత్వమే టెస్టింగ్ కోసం శాంపిల్ పంపిస్తే దానికి ప్రైవేట్ ల్యాబ్ రూ.475 మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అదే వ్యక్తులు స్వయంగా వెళ్లి టెస్టింగ్ చేయించుకుంటే రూ.499 మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇందులోనే టెస్టు ఖర్చు, VTM, PPE ఖర్చు అన్నీ కలగలిపి ఉంటాయి. ఈ టెస్టులు చేసే ల్యాబులు… ICMR అనుమతితో టెస్టులు చేసేవి అయివుండాలి. ఇంతకుముందు టెస్టుల కిట్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ వంటివి కొరతగా ఉండేవి. RT-PCR టెస్టింగ్ కిట్లు కూడా తక్కువగా ఉండేవి. ఇప్పడు వాటి ఉత్పత్తి బాగా పెరిగింది. ఎక్కడైనా అవి లభిస్తున్నాయి. ఫలితంగా వాటి ధర బాగా తగ్గింది. అందువల్ల ప్రభుత్వం ఈ ధరలను తగ్గించింది.