ఆ అధికారులకు చుక్కలు చూపిస్తున్న జగన్

జగన్ పై హత్యాయత్నం కేసులో మరోసారి జగన్ స్టేట్మెంట్ కోసం ప్రయత్నాలు మొదలెట్టారు ఏపీ పోలీసులు. ఈమేరకు జగన్ కు రెండవ లేఖను పంపించారు పోలీసులు. జగన్ సమాధానం బట్టి నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు పోలీసులు. గతంలో కూడా జగన్ వాంగ్మూలం కోసం ప్రయత్నించారు పోలీసులు. అందుకు నిరాకరించారు జగన్. సిట్ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇవ్వలేదు. ఈ మేరకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి లిఖితపూర్వకంగా తెలిపారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోవడం వలనే వాంగ్మూలం ఇవ్వలేదన్నారు.

కాగా మరోసారి జగన్ వాంగ్మూలం కోసం ప్రయత్నిస్తున్నారు ఏపీ పోలీసులు. స్టేట్మెంట్ కావాలి ఈమె ఇవ్వండి అంటూ జగన్ కి లేఖ రాసారు. కాగా ఈసారి కూడా పోలీసులకు చుక్కెదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ పోలీసులపైనే నమ్మకం లేదంటున్న జగన్ ఇప్పుడు మాత్రం వాంగ్మూలం ఎలా ఇస్తారంటూ సందేహం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాయని, వారు చేస్తున్న విచారణపై నమ్మకం లేదని తేల్చి చెబుతున్నారు పార్టీ నేతలు. ఇదే విషయాన్ని జగన్ రిట్ పిటిషన్ లో కూడా పేర్కొన్నారు.

జగన్ రిట్ పిటిషన్ లో పేర్కొన్న అంశాలివే…

ఏపీ ప్రభత్వ వైఫల్యం వలనే ఎయిర్పోర్టులో నాపై హత్యాయత్నం జరిగింది. నాపై జరిగిన హత్యాయత్న దాడికేసును కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలి. అని జగన్ విజ్ఞప్తి చేశారు.

మొత్తం 8 మంది ప్రతివాదుల పేర్లు అందులో పేర్కొన్నారు. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ, ఎయిర్పోర్ట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిట్ ఇంచార్జి అధికారి, కేంద్ర హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతివాదులుగా ఉన్నారు.

ప్రభుత్వం, పోలీసులు కలిసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కేసును రాజ్యాంగబద్దంగా కాకుండా రాజకీయ కోణంలోనే విచారణ జరుపుతున్నారన్నారు.

అధికార పార్టీకి లబ్ది కలిగేలా అధికారులు వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. స్వచ్చంద సంస్థలతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు.

దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఏపీ సీఎం, ఏపీ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టడంపై జగన్ అనుమానాలు వ్యక్తం చేసారు.

తాను హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఏపీ పోలీసులు వాంగ్మూలం కోసం వస్తే సిట్ అధికారులకు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించినట్టు జగన్ పేర్కొన్నారు.

ఏపీ పోలీసులపై నమ్మకం లేనందువల్లే అలా చేయాల్సొచ్చిందన్నారు.

ఏపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నందువల్లే తమపై కుట్ర పన్నారని ఆరోపించారు.

ప్రజాసంకల్పయాత్రలో తమకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తనపై దాడి జరిపించారని ఆరోపించారు.

ప్రస్తుతం కేసు విచారణ ఏపీ డీజీపీ, ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ కనుసన్నల్లో జరుగుతున్నందున థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని జగన్ విజ్ఞప్తి చేసారు.

దాడి తర్వాత ఎన్నో ఫ్లెక్సీలు తెరపైకి వచ్చాయని, శ్రీనివాస్ దగ్గర దొరికాయని చెబుతున్న లేఖల్లో మూడు చేతి రాతలు ఉన్నాయని విషయాన్ని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

మెడపై దాడి చేయబోయాడని, ప్రతిఘటించడంతో భుజానికి గాయమైనట్లు వివరించారు.

కేసును త్వరగా క్లోజ్ చేయించేందుకే నార్త్ వైజాగ్ ఏసీపీని నియమించారని ఆరోపించారు.

తనపై హత్యాయత్నం జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులే స్వయంగా పేర్కొన్నారని విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు.