ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. గత కొద్దీ రోజులుగా గుంటూరు వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రసవత్తరంగా మారాయి. జిల్లాలో అభ్యర్థుల్ని కేటాయించడంలో వైసీపీ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
గుంటూరు చిలకలూరిపేట నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ ఉండగా కొత్తగా వచ్చిన రజిని విడదలను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. లేళ్ల అప్పిరెడ్డి ఆశలు పెట్టుకున్న గుంటూరు పశ్చిమ నియోజక వర్గం సమన్వయకర్తగా నియమించారు. అదే జిల్లాలో గుంటూరు లోక్ సభ సీటు తనదే అన్న ధీమాతో ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలను నరసరావుపేట ఎంపీ స్థానానికి ఫిక్స్ చేశారు.
ఈ మార్పులు చేర్పులతో పార్టీ కోసం మొదటి నుండి కృషి చేస్తున్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే చిలకలూరిపేట నియోజకవర్గం సీటుపై కూడా ఉత్కంఠ రేగింది. రజిని విడదల ఎంట్రీతో మర్రి రాజశేఖర్ కు భంగపాటు కలిగింది. ఆయన్ను బుజ్జగించేందుకు జగన్ ఇప్పుడొక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రజిని విడదల ఎంట్రీ నుండి మర్రి రాజశేఖర్ కు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏమిటో తెలియాలంటే కింద పూర్తి వివరాలు చదవండి.
చిలకలూరిపేటకు చెందిన ఎన్నారై మహిళ, వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ రజిని విడదల వైసీపీలో చేరారు. ఆమెను చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ సింగిల్ కో ఆర్డినేటర్ గా నియమిస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఆమె పార్టీలో చేరినప్పటి నుండి చిలకలూరిపేట రాకీయాలు రసవత్తరంగా మారాయి.
రజిని విడదల పార్టీలో చేరినప్పటి నుండి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. “జగన్ ఆమెకు చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు. దీంతో గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ వీడే ఆలోచనల్లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన వర్గీయులంతా పార్టీ మారమంటూ ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు.
దీంతో ఆయన పార్టీ మారతారని అందరు భావించారు. కానీ వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించడంతో రాజశేఖర్ తన నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవలే మర్రి రాజశేఖర్ ను బుజ్జగించేందుకు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ఎంటర్ అయ్యారు. రాజశేఖర్ తో భేటీ అయ్యి చర్చలు జరిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు అధిష్టానం మాటగా అయోధ్య రామిరెడ్డి తెలిపినట్టు సమాచారం.
నిజానికి మర్రి రాజశేఖర్ పార్టీకి ఎప్పటి నుండో కృషి చేస్తున్నారు. టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుపై ఓటమి పాలైనప్పటికీ పేటలో పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేసారు. చిలకలూరిపేట నియోజకవర్గం టికెట్ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రజిని రాకతో ఆయనకు భంగపాటు కలిగింది. పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తిని జగన్ కూడా వదులుకోవాలి అనుకోవట్లేదు. అలాంటి కీలక నేతలకు పార్టీలో ఉన్నత పదవులు ఇస్తే పార్టీని మరింత పటిష్టం చేస్తారనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.