వైఎస్ జగన్ రాజకీయాల్లో గొప్పగా రాణిస్తుండటానికి కారణం ఆయన ధైర్యమే. ఏం జరిగినా, ఎవరొచ్చినా చూసుకుందాం అనే ఆయన ధైర్యమే ఈనాడు ఆయన చేతిలో అధికారాన్ని పెట్టింది. దీన్ని కొందరు మొండితనం అనుకున్నా, మూర్ఖత్వమని పిలుచుకున్నా అదే జగన్ విషయంలో బాగా వర్కవుట్ అయింది. నిజానికి నాయకుడనే వ్యక్తికి ఆ లక్షణం ఉండాలి కూడ. అదే కేడర్, పార్టీని ముందుకు నడిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఢీకొన్నప్పుడు ఇదే సాహసాన్ని ప్రదర్శించి హీరో అయ్యారు జగన్. ఆ హీరోయిజమ్ ఆయన్ను యువతకు దగ్గర చేసింది. జగన్ ఏదైనా కాసేపే ఆలోచిస్తారు. తర్వాతంతా ఆచరణే. కాబట్టే ఏ విషయంలో అయినా ఆయన నిర్ణయాలు, కదలికలు ప్రత్యర్థుల కంటే వేగంగా ఉంటాయి. నిర్ధిష్టమైన లక్ష్యం ఉన్న నాయకులకే ఈ తరహా వ్యక్తిత్వం ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డిలో అది మెండుగా ఉంది. అధికారంలోకి వచ్చి బోలెడంత భారం, ఒత్తిడి, తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ దాన్ని చెక్కు చెదరనివ్వలేదు ఆయన. ప్రస్తుతం దేశం మొత్తం జమిలి టాపిక్ నడుస్తోంది. మోదీ అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలనే ఆలోచనతో జమిలికి వెళ్లాలని ఆశపడుతున్నారు. బీజేపీ యేతర పాలన ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ ఈ సంగతి తెలిసి కంగారుపడుతున్నాయి. ఉన్నపళంగా 2022 మధ్యలో ఎన్నికలు వస్తే ఎలా ముందుకెళ్లాలో యోచిస్తున్నాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కార్యాచరణ స్టార్ట్ చేశారు. ప్రత్యర్థి పార్టీలను తట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. కేసీఆర్ సైతం జమిలి వాతావరణం మీద ఒక కన్నేసే ఉంచారు. ఇక ఏపీలో అయితే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జమిలి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే విజయం తమదేననే ధీమాతో ఉన్నారు.
అయితే జగన్ మాత్రం అస్సలు భయపడట్లేదు. ఆయన దృష్టిలో జమిలి అనే కంగారు లేనట్టు కనబడుతున్నారు. కానీ మొదట్లో వైసీపీ కేడర్, నాయకులు జమిలి వస్తుందనగానే కాస్త కంగారుపడ్డారు. పూర్తి పదవీ కాలం ఉండేదేమోనని, జనం ఆలోచన మారుతుందేమోనని భయపడ్డారు. అయితే సీఎం మాత్రం జమిలి ప్రసక్తే లేదంటున్నారు. మనం ఐదేళ్లు పాలన చేస్తామని చెబుతున్నారు. ఒక్కసారి వైసీపీ కార్యాచరణ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ప్రతి అంశాన్ని 2024లోనే ఎన్నికలన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కడా హడావిడి, ఆందోళన లేదు. సమయం లేదు, చేయాల్సింది ముందే చేసేయాలనే కంగారు అస్సలు కనిపించట్లేదు.
కొన్ని రాష్ట్రాల్లో ఈమధ్యనే ఎన్నికలు ముగిశాయి. తమిళనాడులో ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తరహా పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలంటే కుదిరే పని కాదని, రాజ్యాంగం మేరకు ఐదేళ్ల తర్వాతే ఎన్నికలని అంటున్నారట జగన్. ఒకవేళ మోదీ ఒత్తిడితో ఎన్నికలు ముందుకొచ్చినా భయపడాల్సింది లేదని, జనంలో పార్టీ ఆదరణ చెక్కు చెదరలేదని అనుకుంటున్నారట. నాయకుడిలోని ఈ ప్రశాంతతను గమనించిన పార్టీ శ్రేణులు నాయకుడు గట్టిగా ఉన్నాడు భయపడాల్సిన పనిలేదన్నట్టు తాపీగా ఉన్నారు.