కేసీయార్‌కి జగన్ పరామర్శ.! రాంగ్ టైమింగ్.!

భారత్ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని హైద్రాబాద్‌లో కలిశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

రాజకీయంగా ఇద్దరి ఆలోచనలూ వేటికవే భిన్నం.! కానీ, 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేసీయార్ నేతృత్వంలోని అప్పటి టీఆర్ఎస్ సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుకాల గులాబీ పార్టీకి వైసీపీ నుంచి అదే స్థాయిలో సహకారాలు అందాయి కూడా.

కేసీయార్ ఇటీవల ఇంట్లో జారపడ్డంతో ఆయనకు శస్త్ర చికిత్స జరగ్గా, ప్రస్తుతం ఇంటి వద్దనే కోలుకుంటున్నారు. ఆయన్ని పరామర్శించేందుకే హైద్రాబాద్ వచ్చారు వైఎస్ జగన్. కేసీయార్‌తో భేటీ అయ్యారు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీయార్ తనయుడు కేటీయార్‌తోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారట జగన్. రాజకీయాల్లో ఈ తరహా భేటీలకు చాలా చాలా ప్రాధాన్యత వుంటుంది.

‘మర్యాద పూర్వక భేటీ.. పరామర్శ..’ ఇలాంటి పేర్లు పెట్టొచ్చుగానీ, అసలు విషయం రాజకీయమే. ఏ రాజకీయ వ్యూహం నిమిత్తం కేసీయార్‌తో జగన్ భేటీ అయి వుండొచ్చు.? అసలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేసీయార్ ఎలా సాయపడగలరు.? ‘దత్త పుత్రుడు గనకనే జగన్, తన దత్త తండ్రి కేసీయార్ దగ్గరకు వెళ్ళారు..’ అంటూ టీడీపీ, జనసేన విమర్శలు చేసే అవకాశం స్వయంగా జగన్ కల్పించినట్లయ్యింది. ఔను, ముమ్మాటికీ ఇది రాంగ్ టైమింగ్.

కేసీయార్‌ని ఆసుపత్రిలో వుండగానే చంద్రబాబు పరామర్శించేశారు. అప్పుడే, జగన్ కూడా వెళ్ళి వుంటే సరిపోయేది. లేదా, ఆ తర్వాత వెళ్ళి పరామర్శించినా బాగుండేది. చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజున, హైద్రాబాద్‌లో కేసీయార్‌ని జగన్ పరామర్శించడం కాకతాళీయమేనని ఎలా అనుకోగలం.? ముమ్మాటికీ ఇది రాంగ్ టైమింగ్.!