ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి గన్నవరం, చీరాల నియోజక వర్గాలు తలబొబ్బి కట్టిస్తున్నాయా? సొంత పార్టీ నేతల కుమ్ములాటతో విసిగిపోతున్నారా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా సన్నివేశాలు. ప్రతిపక్ష పార్టీ ఎలాంటి విమర్శలు చేసినా! జగన్..అతని మంత్రులు..ఎమ్మెల్యేలు ధీటుగా బరిలోకి దిగి వాటిని తిప్పికొట్టేవారు. కానీ సొంత పార్టీలోనే కుమ్ములాట ఎక్కువయ్యే సరికి ఎవర్ని అంటే ఎవరు ఫీలౌతారోనన్న భయంతో ఎవర్నీ ఏమనలేక..కక్కలేక..మింగలేక అయినట్లు అయింది పరిస్థితి. చీరాల నియోజక వర్గంలో దివంతగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మరోసారి ఆమంచి-కరణం వర్గాల మధ్య వివాదం తారా స్థాయికి చేరుకుంది.
తొలి నుంచి ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య జోరు సాగుతోంది. ఇక వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి దండలు వేసే కార్యక్రమాన్ని వివాదాస్పదంగా మార్చేసారు. కరణం తనయుడు వెంకటేష్ చీరాల ప్రజలకు స్వేచ్ఛనిచ్చామని..ఇక్కడ అరాచక పాలన సాగలేదని..బెదిరింపులు సాగవని పరోక్షంగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు వార్నింగ్ సంకేతాలు పంపారు. దీనికి ఆమంచి అంతే స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన పేరు చెబితేనే బెదిరేవాళ్లు ఇప్పుడు జగన్ కాళ్లు పట్టుకుని బ్రతికిపోతున్నారని సీన్ వేడెక్కించారు. ఇక గన్నవరంలో సీన్ అంతే వెడెక్కుతోంది. వల్లభనేని వంశీ– వైసీపీ దుట్టా రామచంద్రరావు వర్గీయుల మధ్య జోరుగా మాటల యుద్దం సాగుతోంది.
దుట్టా ఏకంగా అదిష్టానానికే వార్నింగ్ సంకేతాలిచ్చారు. ఉప ఎన్నిక వస్తే వైసీపీ సీటు తనదేనని ధీమా వ్యక్తం చేసారు. వంశీ సైలెంట్ గా ఉన్నా వెనుక నుంచి తాను చేయాలనుకున్నదంతా చేయగల్గుతున్నాడు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి ఎంట్రీతో గన్నవరం ఇప్పుడు గరం గరమంటోంది. ఇప్పటికే ఈ నలుగురి మధ్య వివాదాన్ని పరిష్కరించేలా పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో ఈసారి నేరుగా పంచాయతీలు రెండూ ఓ కొలిక్కి రావాలంటే జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగాల్సిందే.