ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమేనే పరిస్థితులు తలపిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు ఏదో ఒక విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఈ నేపధ్యంలోనే ఓ విషయంలో టీడీపీ నేత చేసిన తప్పుడు ఆరోపణలపై సీరియస్ అయిన జగన్ సర్కార్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
అయితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన 108 సేవలను సీఎం జగన్ మరింత పునరుద్దరిస్తూ, అత్యధిక టెక్నాలజీతో ఇటీవల 203 కోట్ల రూపాయల ఖర్చుతో 1088 కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 1088 కొత్త అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకురావడం రికార్డ్ అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే 108, 104 వాహనాల కొనుగోలు విషయంలో జగన్ సర్కార్ దోపీడీకి పాల్పడ్డారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
ఈ 108,104 వాహనాలపై జరిగిన అవినీతిని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి లెక్కలతో సహా బయటపెట్టారు. తాజాగా పట్టాభి చేసింది తప్పుడు ఆరోపణలు అని భావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం పట్టాభికి నోటీసులు పంపించింది. ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ నోటీసులు జారీ చేశారు. 108 సేవలపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పట్టాభికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.