ఉత్తరాంధ్రకు పెద్ద పీట వేసిన జగన్

తన ప్రభుత్వంలో బిసిలకు ప్రధానంగా ఉత్తరాంధ్రకు పెద్ద పీట వేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు అర్ధమైపోతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ ను స్పీకర్ పదవికి ఎంపిక చేయటం పట్ల అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు.

తమ్మినేని జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం నుండి ఇప్పటికి ఆరుసార్లు గెలిచారు. ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి రావటం ఇది రెండోసారి. మొదట స్పీకర్ అయ్యింది టిడిపి తరపున ఎస్సీ నేత  ప్రతిభా భారతి. ఇపుడు స్పీకర్ అయిన తమ్మినేని బిసిల్లో కాళింగ ఉపకులానికి చెందిన గట్టి నేత. ఈ జిల్లాల్లో కాళింగుల ప్రాబల్యం చాలా ఎక్కువ. సీనియర్, మాజీ మంత్రి, వివాద రహితుడు, ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు కాబట్టి జగన్ ఎంపికను అందరూ హర్షిస్తున్నారు.

సరే స్పీకర్ విషయాన్ని పక్కనపెట్టినా మంత్రవర్గంలో ఏడుగురు బిసిలకు జగన్ చోటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బిసిలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల జగన్ కు కొన్ని లాభాలున్నాయి. మొదటిది బిసిలు వైసిపిని వదిలి పట్టే అవకాశం తక్కువ. బిసిల మద్దతుంటే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో  40 శాతం విజయం సాధించినట్లే.

మొన్నటి అఖండ విజయానికి బిసిల్లో మెజారిటీ సెక్షన్లు టిడిపిని కాదని వైసిపికి మద్దతు ఇవ్వటమే. లేకపోతే  పార్టీ పెట్టినప్పటి నుండి నుండి బిసిలు టిడిపిని కాదని వేరే పార్టీకి ఓట్లు వేసిందే లేదు. బిసిలను టిడిపి నుండి దూరంగా జరిపి వైసిపి దగ్గరకు వచ్చేట్లు చేసుకోవటంలోనే జగన్ సగం విజయం సాధించినట్లైంది. అందుకే బిసిలకు జగన్ పెద్ద పీట వేయటంలో తప్పేలేదు.