ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ నాలుగున్నరేళ్ల పాలనపై 9 శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. విపక్షాలు ప్రభుత్వ పాలనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా చంద్రబాబు నాయుడు వైట్ పేపర్స్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ నాలుగున్నరేళ్ల పాలనలో వారు చేసిన అభివృద్ధి గురించి శ్వేత పత్రాల ద్వారా వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత పార్టీ నేతలకు దిశా నిర్దేశం కూడా చేసారు. వైసీపీ అధినేత ప్రవేశపెట్టిన నవరత్నాల పధకానికి పోటీగానే చంద్రబాబు 9 శ్వేత పత్రాల వ్యూహం పన్నారని భావిస్తున్నారు వైసీపీ శ్రేణులు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ధీటుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటానికి రెడీ అయ్యారు ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్. అభివృద్ధిపై ప్రభుత్వం వైట్ పేపర్స్ ఇస్తామంటుంటే అభివృద్ధి జరగలేదంటూ బ్లాక్ పేపర్స్ ఇస్తామంటోంది వైసీపీ. దీనిపై ఆ పార్టీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి ఒక ప్రకటన కూడా చేసారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేయనున్న శ్వేత పత్రాలకు పోటీగా బ్లాక్ పేపర్స్ విడుదల చేస్తామన్నారు ఆనం. బీజేపీతో నాలుగేళ్లు అంటగాకి ఇప్పుడు అభివృద్ధికి అడ్డం వస్తోంది అంటున్నారని విమర్శించారు. అంతేకాదు అభివృద్ధికి వైసీపీ అడ్డు వస్తోంది అనడం దారుణం అని ఆయన పేర్కొన్నారు.
మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయకుండా… ఎన్నికల్లో ఆమోదం పొందాలనే చంద్రబాబు ఇలా శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేయకుండానే ప్రజల్లో ఆమోదం పొందడానికి వైట్ పేపర్స్ అనే పాంప్లెట్స్ విడుదల చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో నెగ్గి తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం, వారు చెప్పే మాటలు అసత్యం అని నిరూపించే ప్రయత్నమే మేము విడుదల చేయనున్న బ్లాక్ పేపర్స్ అని అన్నారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బ్లాక్ పేపర్స్ నిర్ణయం తీసుకుని నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు మరో వారం రోజుల్లో బ్లాక్ పేపర్స్ విడుదల చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు.
బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ కలిసి గత ఎన్నికల్లో పోటీ చేసారు. 17 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నారు. మరో ముగ్గురు ఎంపీలను అడ్డగోలుగా కొనుగోలు చేసి వాళ్లలో కలుపుకుని బీజేపీతో నాలుగున్నరేళ్ళపాటు కలిసి నడించిందెవరు అని ఆనం ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రధాని మోడీ అని చంద్రబాబు నాయుడు ప్రశంసించారంటూ ఎద్దేవా చేసారు. ఇప్పుడు వైసీపీ అభివృద్ధికి అడ్డు పడుతుంది అనడం చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనం అన్నారు.