అమరావతిపై వైసీపీ మౌనంగా వుండటమే మంచిదేమో.!

మూడున్నరేళ్ళయిపోయింది వైసీపీ అధికారంలోకి వచ్చి. ఇంకో ఏడాదిన్నరలో వైసీపీ అద్భుతాలేమైనా సాధించేయగలదా.? అంటే, ఆ ఛాన్సే లేదు. ఏడాదిన్నరలో పోలవరం పూర్తికాదు. ఏడాదిన్నరలో ప్రత్యేక హోదా రాదు. ఏడాదిన్నరలో ఒకే ఒక్క రాజధాని కావొచ్చు, మూడు రాజధానులు కావొచ్చు.. ఏదీ ముందుకు కదిలే అవకాశమూ లేదు.

ప్రధానంగా అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రపై మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నది బహిరంగ రహస్యం. పాదయాత్రను అడ్డుకుంటామంటూ మంత్రులే ప్రకటనలు చేస్తున్నారు. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందన్నది నాణానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు అది రాజధాని. రాష్ట్ర రాజధాని. రాష్ట్ర ప్రజల కోసం ఎంపిక చేసిన రాజధాని.

ఏకైక రాజధాని అమరావతిలో కాస్తో కూస్తో అభివృద్ధి జరిగితే, రాష్ట్రానికి ఆ రాజధాని వల్ల మేలు కలుగుతుందన్న ఇంగితాన్ని కోల్పోతోంది వైసీపీ. మూడు రాజధానుల వ్యవహారం ఇప్పట్లో ముందుకు కదలదు. ఎన్నాళ్ళిలా మూడు రాజధానుల వ్యవహారాన్ని సాగదీయడం.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణను తప్పు పట్టలేం. రాష్ట్రానికి మూడు రాజధానులు వుండాల్సిందేనేమో.! మూడు కాకపోతే, ఐదు రాజధానులు పెట్టుకోవచ్చు. కానీ, ముందైతే ఒక రాజధాని.. అదే అమరావతిలో అభివృద్ధికి సంబంధించి పనులు ముందుకు కదలాలి కదా.?

‘మేం అమరావతి పాదయాత్రను అడ్డుకుని తీరతాం’ అని మంత్రులు చేస్తున్న ప్రకటనలు దేనికి సంకేతం.? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్నీ గౌరవించని మంత్రులు, అసలెందుకు ఆ పదవిలో వుండటం.? గతంలో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే, ప్రభుత్వం దిగొచ్చి మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంది. మూడు రాజధానుల విషయంలో ముందుకెళ్ళలేమని తెలిసినప్పుడు ఈ యాగీ ఎందుకు.? రాజధాని విషయంలో మౌనం దాల్చడమే వైసీపీకి ప్రస్తుతానికి మంచిది.