జనసేన పొత్తు కోసం వైసిపి, టిడిపి వెంపర్లాడుతున్నాయా ?

రాబోయే ఎన్నికల్లో జనసేన తో పొత్తుకోసం వైసిపి, టిడపిలు వెంపర్లాడుతున్నాయని పెద్ద జోకు పేల్చారు జనసేన పార్టీ నేతలు. జనసేన అధికార ప్రతినిధి అనీల్ కుమార్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది జనసేనపార్టీయేనంటూ పెద్ద కామిడీ చేశారు. జనసేనతో పొత్తుల విషయంలో టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ చేసిన ప్రకటనతో జనసేన, టిడిపిల్లో కలకలం రేగింది. దానికి రిపేర్ సర్వీసుగానే అన్నట్లుగా టిడిపితో పొత్తులపై పవన్ మాట్లాడుతూ టిజిపై విరుచుకుపడ్డారు. అంతేకానీ టిడిపితో పొత్తుండదని స్పష్టంగా చెప్పలేదు. దాని ఆధారంగానే జనసేన అధికార ప్రతినిధి అనీల్ కుమార్ మాట్లాడుతూ రెండు ప్రధాన పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవటానికి తహతహ లాడుతున్నట్లు చెప్పారు.

నిజానికి జనసేనతో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం వైసిపికైతే లేదన్నది వాస్తవం. ఎందుకంటే, క్షేత్రస్ధాయిలో వైసిపితో పోల్చుకుంటే జనసేన నతింగ్ అనే చెప్పాలి. కార్యకర్తల బలం లేదు. గ్రామస్ధాయి నుండి పార్టీ నిర్మాణం అసలే లేదు. జనసేన తెరపైన కనిపిస్తున్నదల్లా పవన్ కల్యాణ్ మాత్రమే. తెరవెనుక ఓ కోటరి ఉందంతే. కాకపోతే పవన్ కు అభిమానుల బలం మాత్రం అపారంగా ఉందన్న విషయాన్ని ఒప్పుకోవాలి. అయితే, ఉన్న అభిమానుల్లో ఎంతమందికి ఓట్లున్నాయి, రేపటి ఎన్నికల్లో వాళ్ళు జనసేనకు ఏ విధంగా ఉపయోగపడతారన్నది ప్రశ్నార్ధకమే. కాబట్టి జనసేనతో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన అవసరం జగన్ కైతే లేదు.

ఇక తెలుగుదేశంపార్టీ  విషయం చూస్తే ఆ పార్టీ కూడా క్షేత్రస్ధాయిలో చాలా బలంగానే ఉంది. పార్టీ నిర్మాణం పక్కాగా జరిగింది. గ్రామస్ధాయి నుండి  జాతీయస్ధాయి వరకూ పట్టిష్టమైన పునాదులున్నాయి. పార్టీ నిర్మాణంలో టిడిపితో పోల్చుకుంటే జనసేన ఎందుకూ పనికిరాదు. అయితే, ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబునాయుడుకు లేదు. అందుకే తెలుగుదేశంకి ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకుని ట్రైయాంగ్యులార్ కంటెస్టు రాకుండా చూడాలి. ముక్కోణపు పోటీ అంటే బాబు భలే భయం. అందుకే ఐ లవ్ యు ఫీలర్స్ ఎన్ని రకాలుగా పవన్ కు పంపిస్తున్నాడో.

పైగా నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై అన్నీవర్గాల్లోను తీవ్ర అసంతృప్తి కనబడుతోంది. కాబట్టి పవన్ తో పొత్తులు పెట్టుకుంటే కాపుల ఓట్లు లేకపోతే కనీసం అభిమానుల ఓట్లైనా టిడిపికి పడతాయని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకనే తమతో పొత్తు పెట్టుకోవాలంటూ పవన్ ను చంద్రబాబు పదే పదే గోకుతున్నారు.

వాస్తవాలు ఇలా ఉంటే జనసేన అధికార ప్రతినిధి మాత్రం రివర్సు గేరులో మాట్లాడటమే పెద్ద కామెడి. రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకునే పోటీ చేస్తాయనే బలమైన సంకేతాలు కనబడుతున్నాయి. పరిపాలనలో అన్నీ విధాలుగా విఫలమైన చంద్రబాబును విమర్శించకుండా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డినే పదే పదే టార్గెట్ చేసుకోవటంలోనే పవన్ ఉద్దేశ్యం కనబడుతోంది. అందుకనే ఒంటరిగానే పోటీ చేస్తుందని పవన్ చెప్పినా జనాలెవరూ నమ్మటం లేదు. మరి షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పొత్తుల విషయంలో క్లారిటీ రాక తప్పదు కదా ?