సుజనా చౌదరికి షాక్.. అరెస్టు తప్పదా ?

తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ విచారణ నుండి తప్పుకుందామని సుజనా వేసిన ప్లాన్ ను కోర్టు తిప్పికొట్టింది. నవంబర్ 27వ తేదీన చెన్నైలోని ఈడి కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సుంది. అయితే తనను రాజకీయంగా వేధించటానికే ఈడి ప్రయత్నిస్తోందంటూ సుజనా ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. తనను ఈడి విచారణ పరిధి నుండి తప్పించాలంటూ పిటీషన్లో సుజనా కోరారు. సుజనా తరపు లాయర్ వాదన విన్న కోర్టు  ఆ వాదనను కొట్టేసింది. వచ్చే సోమవారం ఈడి విచారణకు హాజరు కావాల్సిందేనంటూ స్పష్టంగా ఆదేశించటంతో సుజనాకు కష్టాలు తప్పేట్లు లేదు.

 

చాలా కొద్ది కాలంలోనే సుజనా తెలుగుదేశంపార్టీలో కీలక నేతగా ఎదిగారు. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా, చంద్రబాబు బినామీగా బాగా ప్రచారంలోకి వచ్చారు. దాంతో టిడిపిలో కీలకంగా మారారు. సుజనాపై చాలాకాలంగా ఆర్దికపరమైన ఆరోపణలున్నప్పటికీ చంద్రబాబు రాజ్యసభకు నామినేట్ చేస్తునే ఉన్నారు. అదే విధంగా పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుబట్టి మరీ కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు. దాంతో చంద్రబాబు-సుజనా బంధంపై అందరిలోను అనుమానాలు ధృవపడ్డాయి.

 

ఇక ప్రస్తుతానికి వస్తే బ్యాంకులను మోసగించి సుజనా వేల కోట్లు వెనకేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దానికి తగ్గట్లే వివిధ బ్యాంకుల నుండి సుజనా సుమారు రూ 6 వేల కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టారట. షెల్ కంపెనీలు కూడా ప్రారంభించి తీసుకున్న వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారని ప్రచారంలో ఉంది. అదే విషయమై సుజనా కార్యాలయాలు, ఇంటిపై ఈడి దాడులు జరిపినపుడు కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, షెల్ కంపెనీలని చెప్పటానికి సాక్ష్యాలుగా 126 రబ్బర్ స్టాంపులు, లెటర్ హెడ్లు దొరికాయి. అందుకే ముందుజాగ్రత్తగా ఈడి సుజనాపై లుకౌట్ నోటీసు కూడా జారీచేసింది. అదే సమయంలో సుజనా వాడుతున్న 6 లగ్జరీ కార్లను కూడా సీజ్ చేసింది.

 

మనీ ల్యాండరింగ్, షెల్ కంపెనీలు ప్రారంభించటం లాంటి ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఈడికి దొరికాయని సమాచారం. అందుకే విచారణకు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చింది. అయితే, ఈడి విచారణ నుండి తప్పించుకోవటానికి సుజనా ఏదో ప్లాన్ చేశారు కానీ వర్కవుట్ కాలేదు. సోమవారం విచారణకు హాజరయ్యే సుజనాను అప్పుడే ఈడి అదుపులోకి తీసుకుంటుందని బాగా ప్రచారం  జరుగుతోంది. అదుపులోకి అంటే అరెస్టనే అంటున్నారు. ఒకవేళ సుజనా చౌదరి గనుక అరెస్టయితే చంద్రబాబుకు వ్యక్తిగతంగా పెద్ద తగిలినట్లే అనుకోవాలి. అందుకే సుజనా విషయంలో తెలుగుదేశంపార్టీ వర్గాల్లో బాగా ఉత్కంఠ పెరిగిపోతోంది. సోమవారం మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.