అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు బాగా ఇబ్బందులు పడిన అంశాల్లో ప్రత్యేకహోదా కూడా ఒకటి. హోదా విషయంలో చంద్రబాబు ఎన్నిసార్లు యూ టర్న్ లు తీసుకున్నారో అందరికీ తెలిసిందే. తీసుకున్న యూ టర్న్ కారణంగానే జనాల ముందు చంద్రబాబు పలచనైపోయారు. అదే సమయంలో హోదా విషయంలో జగన్ తీసుకున్న స్టాండ్ కూడా వైసిపికి సానుకూలంగా పనిచేసింది.
సరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హోదా ఎప్పుడు సాధిస్తావంటూ జగన్ వెంట చంద్రబాబు పడుతున్నారు. ఇప్పటి పరిస్ధితుల ప్రకారం లాజికల్ గా ఆలోచిస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావటం సాధ్యంకాదు. హోదా విషయంలో జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం ఉండదని అందరికీ తెలుసు. ఏపికి హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి అనుకుంటే మాత్రమే హోదా వస్తుంది.
వాస్తవం ఇలాగే ఉంటుందని జగన్ కు కూడా బాగా తెలుసు. మొన్నటి ఎన్నికల్లో బిజెపికి వచ్చిన మెజారిటి చూడగానే జగన్ చేసిన కామెంటే దానికి సాక్ష్యం. అయితే ప్రస్తుతం జగన్ నిస్సహాయతను అడ్వాంటేజ్ తీసుకోవాలని చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నట్లే కనిపిస్తోంది. చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా జగన్ ప్రత్యేకహోదా ఎప్పుడు సాధిస్తాడని అడుగుతున్నారు. టిడిపి ఎంపిలు కూడా హోదా ఇవ్వమని కేంద్రాన్ని అడగటం లేదు. హోదా సాధించమని జగన్ నే టార్గెట్ చేస్తున్నారు.
అదే సమయంలో మళ్ళీ బిజెపితో చేతులు కలిపేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపటం ఇందులో భాగమే. ఏపికి ప్రత్యేకహోదా సాధ్యం కాదని చెబుతున్న బిజెపితో చంద్రబాబు చేతులు కలుపాలని ప్రయత్నిస్తున్నాడంటే ఏమనర్ధం ? ఏపికి ప్రత్యేకహోదా రావటం చంద్రబాబుకే ఇష్టం లేదనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇదే అంశంపై రాబోయే ఐదేళ్ళు జగన్ ను ఇబ్బంది పెట్టటానికి రెడీ అవ్వాలని డిసైడ్ అయిన తర్వాతే చంద్రబాబు బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమైపోతోంది.
