మోడికి చంద్రబాబు దగ్గరవుతున్నారా ?

కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వానికి మద్దతు పలకటం ద్వారా చంద్రబాబునాయుడు మళ్ళీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా ? తాజాగా జరిగిన రెండు ఘటనలతో అందరిలోను అదే అనుమానం మొదలైంది. ఈ మధ్యనే కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను పరోక్షంగా ప్రత్యక్షంగా టిడిపి మద్దతు పలకటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తాజాగా మోడి ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన త్రిపుల్ తలాక్ బిల్లును మామూలుగా అయితే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించాలి.  కానీ త్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో జరిగిన చర్చ తర్వాత ఓటింగ్ నుండి టిడిపి గైర్హాజరయ్యింది. గైర్హాజరవ్వటం అంటే పరోక్షంగా మోడికి సహకరించినట్లే కదా ? ఒకవైపు ఇదే బిల్లును వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా చంద్రబాబు మాత్రం నాటకాలాడుతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు జనాలు మాడు పగలగొట్టారు. దాంతో మెడికి దగ్గరైతే తప్ప రాజకీయంగా మనుగడ కష్టమని చంద్రబాబు గ్రహించారు. అందుకనే మళ్ళీ ఎన్డీఏలో చేరాలని అనుకుంటే మోడి అంగీకరించలేదు. అందుకనే ముందుగా తన రాజ్యసభ సభ ఎంపిలను బిజెపిలోకి పంపారు.

చంద్రబాబు రక్షణకే వాళ్ళు బిజెపిలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఫిరాయించిన నలుగురు ఎంపిల్లో సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు చంద్రబాబుకు బినామీలుగా ప్రచారంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా చంద్రబాబు రక్షణకే పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ సూచనల ప్రకారమే కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు చంద్రబాబు మద్దతు పలికారన్నది వాస్తవం.