జగన్ కు వ్యతిరేకంగా మళ్ళీ కలుస్తున్నారా ?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని రెండు పార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ఇద్దరు చేతులు కలుపుతున్నట్లే ఉంది చూస్తుంటే. జగన్ గురించి వాళ్ళు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే ఆ విషయం ఎవరికైనా అర్ధమైపోతుంది. అంటే ఎన్నికలకు ముందే ఇద్దరి మధ్య అవగాహన ఉందని ప్రచారం జరిగిందనుకోండి అది వేరే సంగతి.

తెలుగుదేశంపార్టీ చరిత్రలోనే ఇంతటి ఘోరమైన ఓటమి ఎదురు కాలేదంటేనే అర్ధమైపోతోంది జనాల్లో చంద్రబాబుపై ఏ స్ధాయిలో వ్యతిరేకత పెరిగిపోయిందో. ఇక జననసేన సంగతి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే అవుతుంది. 130 చోట్ల జనసేన అభ్యర్ధులు పోటీ చేశారు. అందులో రెండుచోట్ల పోటీ చేసిన పవన్ ను జనాలు చిత్తుగా ఓడగొట్టారు.

ఇక్కడ రెండు అంశాలు చంద్రబాబు, పవన్ కు జీర్ణం కావటం లేదు. మొదటిదేమో వైసిపికి అఖండ మెజారిటి రావటం. రెండోదేమో జగన్ కు వ్యతిరేకంగా ఇద్దరూ పరోక్షంగా కలిసినా జనాలు పట్టించుకోకపోవటం. దాంతోనే వాళ్ళిద్దరు జగన్ పై అక్కసు పెంచేసుకున్నారు. తమ ఓటమిని తట్టుకోలేకపోతున్న ఇద్దరు అధినేతలు జగన్ పై అనుచితంగా కామెంట్లు చేస్తు నోటి తీటను వదిలించుకుంటున్నారు.

జగన్ జైలుకెళ్ళి  వచ్చినవాడని, రాష్ట్రాన్ని అరాచకం పాలు చేస్తున్నాడని, పాలనానుభవం ఏమాత్రం లేదని తమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకుండానే అప్పుడే సిఎంగా జగన్ ఫెయిలయినట్లు ఇద్దరూ చెప్పేస్తుండటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ వీళ్ళ కోపం జగన్ మీద లేకపోతే అఖండ మెజారిటితో గెలిపించిన జనాల మీదో అర్ధం కావటం లేదు.