అమరావతి కేంద్రంగా టి రాజకీయాలు… హైదరాబాద్ అంటే అంత భయమా ?

హైదరాబాద్ అంటేనే చంద్రబాబునాయుడు భయపడిపోతున్నట్లున్నారు. తెలంగాణా ఎన్నికలకు సంబంధించిన కీలక వ్యవహారాలన్నీ చంద్రబాబు అమరావతి కేంద్రంగానే నడిపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణా రాజకీయాలను అమరావతి నుండి పర్యవేక్షించటమేంటి ?  ఏమిటంటే, హైదరాబాద్ కు వచ్చి రాజకీయాలు మొదలుపెడితే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే మహాకూటమి సీట్ల సర్దబాటులో ఎంత గందరగోళం జరుగుతున్నా చంద్రబాబు మాత్రం హైదరాబాద్ కు రాలేదు. అసంతృప్తులను, సీనియర్ నేతలను, చివరకు కుకట్ పల్లి అభ్యర్ధి చుండ్రు (నందమూరి)సుహాసిని టిక్కెట్టును  కూడా చంద్రబాబు విశాఖపట్నంలో ఫైనల్ చేశారే కానీ హైదరాబాద్ లో కాదు.

 

ఇంతకీ హైదరాబాద్ అంటే చంద్రబాబు ఎందుకంతగా భయపడుతున్నారు ? ఎందుకంటే, ఓటుకునోటు వ్యవహారం తర్వాత జరిగిన పరిణామాలు ఆ స్ధాయిలో ఉంది కాబట్టే. ఓటుకునోటు కేసులో చంద్రబాబు దాదాపు అరెస్టు దాకా వెళ్ళి తప్పించుకున్నారు. సరే, అప్పట్లో ఏసిబి గురించి పోలీసు గురించి చంద్రబాబు ఉత్తరకుమారుని ప్రగల్బాలు చాలానే పలికారనుకోండి అది వేరే సంగతి. కెసియార్ ను అప్పట్లో అంతలా సవాలు చేసిన చంద్రబాబు తర్వాత తోకముడిచి అర్ధాంతరంగా హైదరాబాద్ వదిలేసి విజయవాడకు పారిపోయారు.

 

ఉమ్మడి రాజధానిలోనే ఉంటే ఎక్కడ మళ్ళీ అరెస్టంటారో అన్న భయంతో విజయవాడకు పారిపోయిన చంద్రబాబు మళ్ళీ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు  చేయలేదు. ఏదో చుట్టుం చేపుగా ఎన్టీయార్ ట్రస్టు భవన్ కు వెళ్ళటం పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు. నేతలతో మాట్లాడేటప్పుడు ఎక్కడా కెసియార్, టిఆర్ఎస్ పేరెత్తకుండా జాగ్రత్తపడుతున్నారు. వివిఐపిలు వచ్చినపుడు కూడా పెద్దగా ఇటువంటివైపు తొంగిచూడలేదు. అటువంటిది, చంద్రబాబు ఇఫుడు కూడా అసంతృప్తులను బుజ్జగించటానికి అందరినీ అమరావతికి పిలిపించుకుంటున్నారు కానీ తాను మాత్రం హైదరాబాద్ రావటం లేదు.

 

 టిడిపి అసంతృప్తులతో మాట్లాడాలన్నా, టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన నేతలను పిలిపించుకుని మాట్లాడాలన్నా అందరినీ విజయవాడే రమ్మంటున్నారు. గడచిన మూడు రోజులుగా అందరూ అమరావతికి వెళ్ళి చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. అదేదో హైదరాబాద్ లోనే చేస్తే మళ్ళీ ఇంటెలిజెన్స్ నిఘా తనపై ఎక్కడ పడుతుందో అన్న ఆందోళనే చంద్రబాబులో బాగా కనబడుతోంది. అసంతృప్తులతో మాట్లాడేటపుడు బుజ్జగింపులు, ప్రలోభాలు ఎలాగూ తప్పవు. దాని ఆధారంగా కెసియార్ దగ్గర ఎక్కడ తగులుకోవాల్సొస్తుందే అన్న భయమే కనబడుతోంది. మరి జరుగున్న వ్యవహారాలు చూస్తుంటే హైదరాబాద్ అంటేనే చంద్రబాబు భయపడిపోతున్నట్లు అర్ధమైపోతోంది.