రెండు రోజుల పాటు విపరీతమైన ప్రచారంలో నిలిచిన అనంతపురం జిల్లా ప్రబోధానంత స్వామి వీడియోల్లో ఏముంది ? ఇపుడిదే ప్రశ్న అందరిలోపు ఆసక్తిని రేపుతోంది. ఎందుకంటే, స్వామి భాగోతాన్ని వీడియోలో రిలీజ్ చేస్తానని తాజాగా జేసి చెప్పటంతో మరో సంచలనానికి రంగం సిద్దమవుతోందా ? అన్న అనుమానాలు మొదలయ్యాయి. జిల్లాలోని తాడిపత్రిలో అబ్బయ్య చౌదరి అలియాస్ ప్రబోధానంద స్వామి ఆశ్రమం ఉంది. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా మొదలైన గొడవ అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి జోక్యంతో తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
సరే, మొత్తానికి రెండు రోజుల గొడవ ఏదోలా సద్దుమణిగినా తాజాగా జేసి చేసిన వ్యాఖ్యలతో వివాదం సద్దుమణగలేదని, కేవలం విరామం మాత్రమే వచ్చిందని అర్ధమవుతోంది. గొడవ తర్వాత చంద్రబాబునాయుడును కలవటానికి జేసి
అమరావతికి వచ్చారు. ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ అవేంటంటే, త్వరలో ప్రబోధానందస్వామికి చెందిన వీడియోలను విడుదల చేస్తానంటూ పెద్ద బాంబే పేల్చారు. ఎందుకంటే, ఆశ్రమాలంటే ఇపుడు అర్దాలే మారిపోయాయి. 7 స్టార్ కు మించిన సౌకర్యాలు, వ్యక్తిగత సిబ్బందిగా, పరిచారికలుగా అందమైన భామలు వగైరా వగైరాలతో కొన్ని ఆశ్రమలు ఎంతలా భ్రష్టుపట్టాయో అందరూ చూసిందే. మహారాష్ట్రలోని రాధేమా ఆశ్రమం, పంజాబ్ లోని డేరా సచ్చా బాబా, హర్యానాలోని ఆశారామ్ బాపూజీ ఆశ్రమం లాంటివి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. దాంతో ఆశ్రమాలంటే లోపలేం జరుగుతోందో అని అనుమానించే వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇపుడు జేసి మాటల్లో కూడా అదే అర్దం వినిపిస్తోంది.
ఆశ్రమం నిర్వాహకులతో జరిగిన రెండు రోజుల గొడవల్లో స్వామిజీ-జేసిలో ఓడిందెవరు ? గెలిచిందెవరో ? చెప్పాలంటూ జేసి మీడియానే ఎదురు ప్రశ్నించటం గమనార్హం. తాను స్వామీజీకి సాష్టాంగపడ్డానని జరుగుతున్న ప్రచారంలో అర్దం లేదని కొట్టిపడేశారు. కుల, మతాలకు అతీతంగా స్వామీజీ బాధితులున్నట్లు జేసి చెబుతున్నారు. చివరకు రాబోయే ఎన్నికల్లో తాజా వివాదం ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.