ఆ నేతలను నిద్రలేపడం చంద్రబాబుకు సాధ్యమా.. గెలుస్తుందని నమ్మకం లేదా?

అధికారంలో పార్టీ ఉందంటే ఏ స్థాయిలో విలువ ఉంటుందో పార్టీ అధికారంలో లేకపోతే అదే స్థాయిలో గౌరవం తగ్గుతుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. టీడీపీ అధికారంలో లేకపోవడంతో సొంత పార్టీ నేతలే పార్టీ వైఫల్యాల గురించి బహిరంగంగా చెబుతున్నారు. కొన్ని విషయాలలో టీడీపీ మారకపోతే పార్టీకి భారీస్థాయిలో నష్టం తప్పదని టీడీపీ నేతలు వెల్లడిస్తున్నారు.

సీఎం జగన్ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు సిద్ధమవుతుండగా టీడీపీ ఇన్ ఛార్జులు మాత్రం పార్టీని 2024లో అధికారంలోకి తీసుకొనిరావడానికి కష్టపడటం లేదు. చంద్రబాబు ఎంతగానో కష్టపడుతున్నా పార్టీ కీలక నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం చంద్రబాబుకు షాకిస్తోంది. మరి కొందరు నేతలు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని లేకపోతే టీడీపీ అధికారంలోకి రాదని సూచనలు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నేతలు 2024 ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేరు. టీడీపీ నుంచి ఆర్థికంగా సహాయసహకారాలు అందితే మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని అలా జరగని పక్షంలో పోటీకి దూరంగా ఉండాలని మరి కొందరు భావిస్తున్నారు. కొంతమంది నేతలు మాత్రం టీడీపీ నుంచి పోటీ చేయడం కంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం బెటర్ అనే భావనను కలిగి ఉన్నారు.

ఏపీలోని చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీలు లేవు. కష్టపడి పని చేసినా చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటనే భావనను మరి కొందరు కలిగి ఉన్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే టీడీపీకి భవిష్యత్తు లేదని అందువల్ల ఆ పార్టీని సపోర్ట్ చేయలేమని మరి కొందరు భావనను కలిగి ఉన్నారు. 2024 ఎన్నికలు టీడీపీ భవిష్యత్తుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కీలకం కానున్నాయి. పార్టీ నేతలను నిద్ర లేపడం చంద్రబాబుకు సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.