గడచిన మూడు దశాబ్దాలుగా తెలుగుదేశంపార్టీకి సంపూర్ణ మద్దతుగా నిలిచిన బిసి సామాజికవర్గాలు ఇక పార్టీకి దూరమైనట్లేనా ? టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం వ్యక్తం చేసిన ఆందోళన చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబునాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ ఓటమిపై నేతలు మాట్లాడుతూ బిసిలు పార్టీకి దూరమవ్వటం వల్లే ఘోర ఓడిపోయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పొలిట్ బ్యూరో సభ్యుల అభిప్రాయం నూటికి నూరు శాతం కరెక్టే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. కాకపోతే తన వ్యవహార శైలి వల్లే పార్టీకి బిసిలు దూరమయ్యారని, అందుకే ఘోరంగా ఓడిపోయామని అంగీకరించటానికి చంద్రబాబుకు ఇగో అడ్డు వస్తోంది.
అందుకే ఓటమి తర్వాత పార్టీ సమావేశాల్లో తరచూ ఎందుకు ఓడిపోయామో తెలియటం లేదని, 23 సీట్లు మాత్రమే గెలిచేంత తప్పులు తానేం చేశానని పదే పదే సానుభూతి డ్రామాలాడుతున్నారు. తాను చేసిన తప్పులేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఎన్ని సామాజికవర్గాలను తాను దూరం చేసుకున్నది, అవినీతి కంపు ఏ స్ధాయిలో పేరుకుపోయింది తెలీని అమాయకుడేమీ కాదు చంద్రబాబు.
కాకపోతే పార్టీ ఓటమికి తాను బాధ్యత తీసుకోవటం చంద్రబాబుకు ఇష్టం లేదు. గెలుచుంటే మొత్తం క్రెడిట్ తనకు తానే ఆపాదించుకునేవాడే అనటంలో సందేహమే లేదు. అయితే ఘోరంగా ఓడిపోయింది కాబట్టి తాను బాధ్యత తీసుకోలేక, ఎవరిపైనా బాధ్యత మోపలేక అవస్తలు పడుతున్నాడు. ఆ విషయాన్ని పొలిట్ బ్యూరో సభ్యులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.