అంబటి అత్యుత్సాహం: టీడీపీ లాంటి పరాజయం వైసీపీకి ఆశిస్తున్నారా.?

Ambati

పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది.? అన్న ప్రశ్నకు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దగ్గర సమాధానం లేదు. ‘దశల వారీగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది..’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు అంబటి. అంతేనా, పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక.. కేంద్రమే ఆ ప్రాజెక్టుని పర్యవేక్షిస్తుంది గనుక, కేంద్రాన్నే ఈ విషయమై నిలదీయాలన్నది మంత్రి అంబటి ఉవాచ.

మరి, ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీ ఎందుకు అప్పటి అధికార పక్షం టీడీపీని పోలవరంపై విమర్శించినట్లు.? చంద్రబాబు హయాంలో అప్పటి మంత్రి దేవినేని ఉమ, 2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, తొలి దశ మంత్రి వర్గంలో పని చేసిన అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే, 2020, 2021 డెడ్‌లైన్లు పెట్టి, పదవి పోగానే, ‘నాకేటి సంబంధం’ అనేశారు.

అంతకు ముందు వరకూ అనిల్ కుమార్ యాదవ్ తొడకొట్టి, మీసం మెలేసి మరీ, పోలవరం ప్రాజెక్టు పూర్తిపోతుందని చెప్పిన మాటల్ని ఎలా మర్చిపోగలం.? ఇప్పుడేమో మంత్రి అంబటి మాటలు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. తన హయాంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయని చంద్రబాబు, ఆ ప్రాజెక్టు విషయమై వైసీపీని విమర్శించే నైతిక హక్కుని కోల్పోయారని అంబటి సెలవిచ్చారు. ఇదెక్కడి చోద్యం.? టీడీపీ పోలవరం ప్రాజెక్టు కట్టలేదు.. ఫలితం అనుభవించింది 2019 ఎన్నికల్లో.

మరి, వైపీపీ కూడా అలాంటి పరాజయాన్ని వచ్చే ఎన్నికల్లో కోరుకుంటోందా.? అంబటి రాంబాబు ఆ విధంగా జరగాలని ముచ్చటపడుతున్నారా.? మంత్రులేంటో ఒకరికి మించి ఇంకొకరు.. అన్నట్టు తయారయ్యారు. చూస్తోంటే, ఇదేదో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీలోనే జరుగుతున్న కుట్రగా అనుమానించాలేమోనని నెటిజనం అభిప్రాయపడుతుండడం గమనార్హం.