ఎవరైతే చంద్రబాబు పాలనలో గట్టిగా పవర్, పలుకుబడి చూపించారో వాళ్లంతా ఇప్పుడు వణికిపోతున్నారు. రాజకీయ నాయకులే కాదు ప్రభుత్వ అధికారులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. వణికిపోతున్నది ఎవరికో కాదు జగన్ సర్కారుకి. బాబు హయం నడుస్తున్నప్పుడు కొందరు నేతలు, ఐపీఎస్ అధికారులు వైసీపీని ఒక ఆట ఆడుకున్నారు. ఫుల్ పవర్స్ ప్రయోగించి ఎక్కడికక్కడ కట్టడిచేశారు. అలాంటి వాళ్లందరినీ వరుసపెట్టి టార్గెట్ చేస్తున్నారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పరిస్థితి అలానే ఉంది.
అరెస్ట్ చేస్తారేమోనని ఆయన తెగ కంగారుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు తిప్పలు మొదలయ్యాయి. ఇజ్రాయిల్ నుండి సెక్యూరిటీ పరికరాల కొనుగోలు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుండి తొలగించి, సస్పెండ్ చేశారు. ఈ ఆరోపణలా విషయంలో తనపై కేసు నమోదు కాకుండా చూడాలని ఏబీ కోర్టును కోరగా న్యాయస్థానం అంగీకరించలేదు.
అప్పటి నుండి ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతానా అనే కంగారు మొదలైంది ఆయనలో. మరీ ముఖ్యంగా వీకెండ్ వస్తోంది అంటే ఆ కంగారు మరింత పెరిగిపోతోంది. వారాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చడం, అరెస్టులు లాంటి వాటిలో జగన్ సర్కార్ ప్రత్యేక గుర్తింపు పొందింది. అందుకే తనను కూడ వీకెండ్ చూసి మరీ అరెస్ట్ చేయవచ్చని, అప్పుడు 48 గంటలు పోలీస్ కష్టడీలోనే ఉంచుతారని అనుమానంగా ఉందని ఏబీ కోర్టును ఆశ్రయించారు. నిబంధనలు మేరకు 48 గంటల పాటు అధికారులు కస్టడీలో ఉంటే సస్పెండ్ ఖాయం. తనను కూడ కోర్టుకు సెలవు ఉండే వారాంతంలో అరెస్ట్ చేసి 48 గంటలు కస్టడీలో ఉండేలా చేసి మరోసారి సస్పెండ్ చేస్తారేమోనని ఏబీ హైకోర్టును ఆశ్రయించి తన అరెస్ట్ జరగకుండా చూడాలని ముందస్తు బెయిల్ కోరారు. మరి ఆయన పిటిషన్ మీద హెకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.