జగన్ కు పెరుగుతున్న మద్దతు..వైసిపిలో ఫుల్ జోష్

రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. రాష్ట్రంలో మద్దతు కాకూండా  పొరుగు తెలుగు రాష్ట్రంలోని కెసియార్, అసదుద్దీన్ ఓవైసి కూడా జగన్ కు మద్దతు పలికటం వైసిపికి జోష్ నింపేదే. పోయిన ఎన్నికల్లో తృటిలో అధికారం కోల్పోయిన జగన్ అప్పటి నుండి ఆందోళనలు, నిరసనలతోనే కాలం గడుపుతున్నారు. దానికితోడు చంద్రబాబునాయుడి ప్రజా వ్యతిరేక పాలన కూడా తోడవ్వటంతో ఏకంగా పాదయాత్రే మొదలుపెట్టేశారు. పాదయాత్రకు ముందుతో పోల్చుకుంటే పాదయాత్ర మొదలైన తర్వాతే జనాల్లో జగన్ కు క్రేజు మరింత పెరిగిందన్నది వాస్తవం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబును అధికారంలో నుండి సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారని వైసిపి నేతలు చెబుతున్న విషయాలు కూడా అందరూ వింటున్నదే.

పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయలేక చంద్రబాబు చతికిలపడ్డారు. దాంతో కాపులు, ముస్లింలు, బిసిలు, డ్వాక్రా సంఘాలు, రైతు కుటుంబాలు, యువత ప్రధానంగా నిరుద్యోగ యువత అంతా మండుతున్నారు. సరే, వారిలో ఎంతమంది జగన్ కు సానుకూలంగా ఓట్లేస్తారో తెలీదు. అయితే, తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు వెలువడగానే జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. మీడియా సమావేశంలో కెసియార్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో విజయవాడకు వెళ్ళి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తానని స్పష్టంగా ప్రకటించారు.

తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు వచ్చి ప్రచారం చేసినపుడు ఏపి ఎన్నికల్లో తాను మాత్రం ఎందుకు వేలు పెట్టకూడదన్నది కెసియార్ లాజిక్.  ఏపిలో కెసియార్ వేలు పెట్టటమంటే జగన్ కు అనుకూలంగానే అని అప్పుడే ప్రచారం మొదలైపోయింది. మొదటి నుండి కూడా జగన్ కు మద్దతుగానే కెసియార్, కెటియార్ మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఏదో ఓ రూపంలో కెసియార్. కెటియార్ ల మద్దతు జగన్ కే సంపూర్ణంగా ఉంటుందన్నది అర్దమైపోయింది.

ఇక, అసదుద్దీన్ ఓవైసి కూడా తాజాగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ కు మద్దతు ప్రకటించేశారు. జగన్ కు అనుకూలంగా ఏపికెళ్ళి ప్రచారం చేస్తానని స్పష్టంగా చెప్పారు. ఎలాగూ చంద్రబాబుపై ఏపిలోని ముస్లింలలో అత్యధికులు మండిపోతున్నారు. అసలే మండుతున్న ముస్లింలకు ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసి కూడా తోడైతే చంద్రబాబుకు కష్టాలు తప్పేట్లు లేదు.  చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒకవైపు ముస్లింలను ఓవైసి బ్రదర్స్ కూడగడుతూ, మరోవైపు కెసియార్, కెటియార్ లు కూడా జగన్ కు మద్దతుగా దిగితే చంద్రబాబు పని గోవిందా.