టీడీపీతో జనసేన పొత్తు.! లైట్ తీసుకోవడమే జగన్‌కి మంచిదేమో.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనంలోకి వచ్చిన ప్రతిసారీ, టీడీపీ – జనసేన పొత్తు గురించే మాట్లాడుతూ వస్తున్నారు. ఘాటైన విమర్శలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం సంకేతాలు పంపుతున్నట్లు.!

రాజకీయాలన్నాక పొత్తులు సహజం. టీడీపీ – జనసేన గతంలో కలిశాయి. దాన్ని పొత్తు అనలేం. ఎందుకంటే, అప్పటికి జనసేన పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరలించలేదు. ఇక, వైసీపీ కూడా 2014 ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. అదీ తెలంగాణలో.. కొన్ని పరిమిత నియోజకవర్గాల్లో (ఖమ్మం జిల్లాలో).

సో, సింగిల్ సింహం.. అన్న మాటకే అర్థం లేదు.! జనసేన – టీడీపీ పొత్తు నైతికమా.? అనైతికమా.? అన్నది ఓటర్లు తేల్చుతారు 2024 ఎన్నికల్లో. ఈలోగా వీలైనంత డ్యామేజ్ ఆ రెండు పార్టీలకూ చేయాలన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశ్యం కావొచ్చుగాక.

కానీ, జరుగుతున్నదేంటి.? ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని.. ఇలాంటి అంశాలపై చర్చ జరగాల్సింది పోయి.. కేవలం పొత్తుల వ్యవహారాల మీదనే చర్చ జరుగుతోంది. ముఖ్యమైన అంశాలు డైవర్ట్ అవుతున్నాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించొచ్చుగాక.

కానీ, 2024 ఎన్నికల కోసం జనంలోకి వెళితే, జనానికి ఆయా అంశాలపై ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ స్పష్టత ఇవ్వాల్సి వుంటుంది. అందుకే, ముందంటూ ఆయా అంశాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం వైఎస్ జగన్ ముందున్న తక్షణ కర్తవ్యం.