ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏడాదిన్నర కాలంగా సంక్షేమ పథకాలు అమలుపైనే దృష్టి సారించి పనిచేసిన సంగతి తెలిసిందే. మేనిఫేస్టోనీ జగన్ అంత సీరియస్ గా తీసుకున్నారు కాబట్టే పథకాలు అమలు విషయంలో జాప్యం గానీ, అవకతకలు గానీ జరగలేదు. జగన్ టీమ్ ఈ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది కాబట్టే ఏడాదిలోనే 80 శాతం సంక్షేప పథకాలు అమలు జరిగింది. ఏడాది పాలన అనంతరం పథకాల అమలు తీరును విశ్లేషించుకుని..అందని వారికి ఆ ఫలాలు అందేలా చర్యలు సైతం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా..రాజకీయంగా చాలా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రతిపక్షం ఆరోపణలు..సొంత పార్టీ లోనే అసమ్మతి సెగ గళం..మంత్రులు..ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదని ఇలా పలు అంశాల్లో జగన్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతీ పథకంలోనూ…అంశంలోనూ జగన్ బ్రాండ్ తప్ప మరో పేరు మార్కెట్ లోకి రాకుండా చేసారన్న ఆరోపణ కూడా ఉంది. 13 జిల్లాల్లో నియోజక వర్గాల వారీగా అభివృద్ధి చూసుకుంటే గుండు సున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. స్థానికంగా శిలాఫలకాలపై ఎమ్మెల్యేలు..మంత్రులు తమ పేర్లు చూసుకోవాలని ఎంత ఆశపడుతున్నా! ఆ కోరిక మాత్రం నెరవేరలేదు.
కేవలం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడ వల్లే ఇలా జరుగుతుందన్నది తెలిసిందే. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం బలంగా ఏర్పాటయ్యే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమే ఇది పార్టీ భవిష్యత్ కి ఎంత మాత్రం మంచి పని కాదు. పార్టీపై క్షేత్ర స్థాయిలోనే దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సొంత పార్టీ నేతల ఆదేశాల్ని అధికారులు పట్టించుకోలేదని విమర్శలున్నాయి. జగన్ చెబితే పనులవుతు న్నాయి తప్ప! ఆయన కింద ఉన్న మంత్రి వర్గం ఆదేశాల్ని అధికారులు పట్టించుకోలేదని పలువురు మంత్రులు మీడియా సమక్షంలోనే అసంతృప్తిని వ్యక్తం చేసారు.