జగన్ మోహన్ రెడ్డి..నరేంద్ర మోదీ..కేసీఆర్ ల రాజకీయాల శైలి ఒకేలా ఉందా? ముగ్గుర్నిసరిపోల్చితే ..ఒకేలా సరితూగుతారా? అంటే అవుననే టాక్ పొలిటికల్ కారిడార్ లో చర్చకొస్తుంది. మోదీ-షాలు తమకు అనుకూలంగా ఉంటే! అంతే మంచే తరుగుతుందన్నట్లు వ్యవహరిస్తారు అనడానికి ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ర్టాల్ని ఉదాహరణగా చెప్పొచ్చు. పొలిటికల్ గా తమకు అనుకూలంగా ఉన్న రాష్ర్టాలపై మోదీ విధి విధానాలు అనుకూలంగానే ఉంటాయనడానికి చాలా సందర్భాల్ని ఉదహరించవచ్చు. ఒకవేళ ఎదురుతిరిగితే! రాజకీయంగా ప్రతి దాడి ఎలా ఉంటుందన్నది తెలిసిందే.
నయానో..భయానో బెదిరించి వాళ్ల దారికి తెచ్చుకుంటారు అన్న విమర్శ అయితే బీజేపీపై చాలా బలంగానే ఉంది. ఇక తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి ధోరణితో ముందుకెళ్తున్నారో ప్రజలు చూస్తున్నదే. ఉద్యమాల పురిట గడ్డపైనే ఉద్యమాలు..తిరుగుబాటే లేకుండా చేయాలన్నది కేసీఆర్ ప్లాన్. కేసీఆర్ గద్దెనక్కినప్పటి నుంచి నేటి వరకూ ఆ పరిస్థితులను విశ్లేషిస్తే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏకపక్షంగా పాలించాలని కేసీఆర్ ముందుకెళ్తున్నారు. కేసీఆర్ ఓ నియంతని ఇప్పటికే పెద్ద విమర్శ ఆ రాష్ర్ట ప్రజల నుంచి వ్యక్తమైంది. నిజానికి ఫెడరల్ ప్రెంట్ తీసుకొచ్చి దేశాన్నే ఏలేద్దామని కేసీఆర్ పెద్ద స్కెచ్ వేసారు. కానీ అది బెడిసికొట్టింది.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏడాది కాలంగా టీడీపీ టార్గెట్ గా పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలని బయటకు తీస్తూ ఒక్కొక్కరిగా ఊచలు లెక్కెట్టిస్తున్నారు. 2024 ఎన్నికల సమయానికి ప్రతిపక్షన్నే భూస్థాపితం చేసి సునాయాసంగా పీఠం దక్కించుకోవాలని కసరత్తులు చేస్తున్నట్లు ఇప్పటికే విమర్శలు తెరపైకి వచ్చాయి. ఇలా మోదీ+ కేసీఆర్+ జగన్ ని దగ్గరగా పరిశీలిస్తే ముగ్గురి వ్యవహార శైలిలో కొన్ని పాయింట్లు కామన్ గా కలుస్తున్నట్లే ఉంది. కానీ ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దం. అధికార పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలి. ప్రజలు కూడా ఏ పార్టీకి భారీ మెజార్టీ అనేది ఇవ్వకూడదు. అలా చేస్తే! మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు సుమీ.