రీఛార్జికి రూ.200 లేక ఆత్మహత్య చేసుకుంటే.. 9000 వసూలు చేసిన ఆసుపత్రి సిబ్బంది!

ప్రస్తుత కాలంలో అన్ని పనులు డబ్బుతో ముడిపడి ఉంటాయి. డబ్బు చెల్లిస్తేనే ఏ పనైనా జరుగుతుంది. తాజాగా రీచార్జ్ చేసుకోవటానికి 200 రూపాయలు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆసుపత్రి సిబ్బంది 9వేల రూపాయలు వసూలు చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఈరోజుల్లో మనుషులలో మానవత్వం కరువైంది. కూలి చెబితే గాని పూటగడవని నిరుపేదలను వైద్యం పేరుతో దారుణంగా హింసిస్తున్నారు .

వివరాలలోకి వెళితే… అశ్వరావుపేట మండలం నారాయణపురానికి చెందిన ఎడవెల్లి సురేందర్ అనే యువకుడు రీఛార్జ్ కోసం కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అతనిని దగ్గరలోని అశ్వరావుపేటలో ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేందర్ మృతి చెందాడు. వైద్యులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పచెప్పుతామని అనడంతో పోస్టుమార్టం కోసం వెళ్లిన కుటుంబ సభ్యులను ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.

ప్రభుత్వాసుపత్రిలో వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం చేయడం కోసం పోస్టుమార్టం చేసే వ్యక్తికి రూ.3000, ఇతర సామాగ్రికి 1500, రూమ్ శుభ్రపరచడానికి 500, ఇతర ఖర్చులు 3000, ఫొటో చిత్రీకరణకు వెయ్యి రూపాయలు అంటూ మృతుడి కుటుంబం దగ్గర తొమ్మిది వేల రూపాయలు వసూలు చేశారు. కూలికి వెళ్తే గాని పూట గడవని పేదల వద్ద పోస్టుమార్టం పేరు చెప్పి 9000 రూపాయలు దోచుకున్నారు. రీఛార్జ్ కి 200 రూపాయలు లేక ఆత్మహత్య చేసుకుంటే ఏకంగా 9000 రూపాయలు వసూలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆస్పత్రి సిబ్బందిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.