హిందూ ధర్మం.! అప్పుడెందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్.?

వస్తాయ్.. అన్ని అంశాలూ చర్చకు వస్తాయ్.! నిలదీత విషయంలో, పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకుని తీరాల్సిందే. ‘నాదీ బాధ్యత..’ అని, 2014 ఎన్నికల సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. బీజేపీ, టీడీపీ.. ఈ రెండూ కలిసి పోటీ చేశాయ్ ఆ ఎన్నికల్లో. జనసేనాని పవన్ కళ్యాణ్, బయట నుంచి మద్దతిచ్చి ఊరుకున్నారు.

ప్రత్యేక హోదా దగ్గర్నుంచి, చాలా అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత ఆ బాధ్యతను విస్మరించినట్లే వ్యవహరించారు. సరే, ఏ పదవీ లేని పవన్ కళ్యాణ్ మాట టీడీపీ దగ్గరైనా, బీజేపీ దగ్గరైనా చెల్లదన్నది బహిరంగ రహస్యం. కానీ, రాజకీయ నాయకుడన్నాక.. మాట మీద నిలబడి, ప్రజల తరఫున నినదించాలి కదా.?

ఇప్పుడు, వైసీపీ మీద చెలరేగిపోతున్న పవన్ కళ్యాణ్.. ఇదే జోరులో టీడీపీ మీద కూడా చెలరేగిపోయి వుంటే.. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఒకింత మెరుగైన పరిస్థితుల్లో వుండేవారే. 2014 ఎన్నికల్లో పోటీ చేసి వుంటే, ఖచ్చితంగా జనసేనాని ప్రజా ప్రతినిథి అయి వుండేవారు.. ఆ ఇంపాక్ట్ 2019 ఎన్నికల మీదన కూడా వుండేది.

హిందూ ధర్మం గురించి కొత్తగా పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. ‘నువ్వు ఎవడివి జగన్.?’ అని కూడా ప్రశ్నిస్తున్నారు. దేవాలయాల్లో పూజారులకు సంబంధించిన వేలాన్ని జనసేనాని నిలదీసేశారు. ప్రశ్నించడం తప్పు కాదు.. చంద్రబాబు హయాంలో హిందూ ధర్మం వివాదాల్లో కూరుకుపోయినప్పుడు కూడా ప్రశ్నించాలి కదా.?

ఇస్లాం, క్రిస్టియన్.. ఈ మతాల్లో ఇలాంటి వేలం వ్యవహారాలకు చోటు ఇస్తే ఊరుకుంటారా.? అని జనసేనాని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించాల్సిందే.. కానీ, అప్పుడూ ప్రశ్నించి వుంటే.. ఇప్పుడు ప్రశ్నకు విలువ వుండేది. దైవ దర్శనానికి టిక్కెట్ల దగ్గర్నుంచి.. అన్ని విషయాలపైనా ప్రశ్నించాలి కదా.? ప్చ్.. ఆ రిస్క్ అయితే చేయలేరాయన.